నేడు టీఆర్‌ఎస్‌ఎల్‌పీ సమావేశం…

205
TRS LP Meeting to be held Today
- Advertisement -

తెలంగాణ శాసనసభ సమావేశాలకు టీఆర్ఎస్ సిద్దమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ  శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఇవాళ భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది.  ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంపై పార్టీ సభ్యులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శాసనసభ సమావేశాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలతోపాటు నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్న తీరును కూడా ఈ సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఎంపీలు కూడా హాజరుకావాల్సిందిగా ఇప్పటికే ఆహ్వానాలను పంపించారు.

ఈసారి సమావేశాల్లో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, భూసేకరణ అంశాలపై ఎక్కువగా చర్చ జరిగే అవకాశముందని భావిస్తున్నారు. పార్టీలన్నీ మూకుమ్మడిగా విమర్శలవర్షం కురిపించినా వాటిని ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు.. విమర్శలకు చెక్‌ పెడుతూనే… సభలో ప్రభుత్వ విధానాలను స్పష్టంగా చెప్పాలని గులాబీ దళం నిర్ణయించింది.

సభలో ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానమిస్తూనే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని స్పష్టంగా వివరించాలని అధికారపార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. అత్యంత వెనకబడిన తరగతులకోసం వెయ్యికోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు విషయాన్ని సభా వేదికగా ప్రకటించాలని చూస్తున్నారు.  ప్రభుత్వ పథకాలు సక్రమంగా నడవడం, డబుల్‌ బెడ్‌ రూం పనులు వేగవంతం చేయడంతో పెద్దగా ఇబ్బందులుండవని గులాబీ నేతలు అంచనావేస్తున్నారు. మొత్తానికి సభలో అనుసరించాల్సిన వ్యూహంపై గురువారం సమావేశంలో నేతలు చర్చించనున్నారు.

- Advertisement -