ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో 154 అసెంబ్లీ స్థానాలకు టీఆర్‌ఎస్ పార్టీకి 101-106 సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఎంపీలు కూడా ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంపై పార్టీ సభ్యులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శాసనసభ సమావేశాలను ఉపయోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలతోపాటు నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్న తీరును కూడా ఈ సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలన్నారు కేసీఆర్.
పార్టీలన్నీ మూకుమ్మడిగా విమర్శలవర్షం కురిపించినా వాటిని ఎదుర్కొనేందుకు సభ్యులందరు రెడీ ఉండాలని, విమర్శలకు సైతం చెక్ పెడుతూ.. ముందుకు సాగాలని సభలో ప్రభుత్వ విధానాలను స్పష్టంగా చెప్పాలని గులాబి బాస్ సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రతి ఒక్క సభ్యుడు హాజరు కావాలని అన్నారు. సభలో ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానమిస్తూనే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని స్పష్టంగా వివరించాలని అధికారపార్టీ నేతలకు సీఎం సూచించారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా నడవడం, డబుల్ బెడ్ రూం పనులు వేగవంతం చేయడంతో పెద్దగా ఇబ్బందులుండవని తెలిపారు.