టీఆర్ఎస్‌లోకి ఈటల రాజేందర్ ?

389
- Advertisement -
  • బిజెపిలో ఇమడలేకపోతున్న ఈటల?
  • మునుగోడు ఉపఎన్నికలో ఎన్నో గుణపాఠాలు
  • బండి, కిషన్స్ తో వేగలేకపోతున్న ఈటల !
  • ఢిల్లీ పెద్దలకు బండి, కిషన్లపై ఫిర్యాదు ?
  • చేరికల్లేక చతికిలపడ్డ ఈటల రాజేందర్ ?

ఈటల రాజేందర్ వ్యవహారం భారతీయ జనతా పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఈటల రాజేందర్ మళ్ళీ
టి.ఆర్.ఎస్.లోనికి వెళ్ళిపోతున్నారనే వార్తలు వెల్లువెత్తడంతో తెలంగాణ బిజెపి నేతల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈటల రాజేందర్ కు టి.ఆర్.ఎస్ నుంచి పిలుపు వచ్చిందని, మళ్ళీ మంత్రి పదవిని ఇచ్చేందుకు టిఆర్ఎస్ అధిష్టానం ఆఫర్ ఇచ్చిందని, అందుకే ఈటల రాజేందర్ సొంతగూటికి వెళ్ళేందుకు సమాలోచనలు జరుపుతున్నారని బిజెపిలోని కొందరు సీనియర్ నాయకులు వివరించారు.

ఒకవైపు టి.ఆర్.ఎస్ నుంచి ఆఫర్లు రావడం, మరోవైపు బిజెపిలో కూడా ఈటల రాజేందర్ ఇమడలేకపోవడం, బిజెపిలోని గ్రూపు రాజకీయాలు ఈటల భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారాయని, అందుకే ఆయన విసుగుచెందారని అంటున్నారు.

ప్రస్తుతం సోషల్  మీడియాలో కోడై కూస్తున్న ఈటల రాజేందర్ టిఆర్ఎస్ లో చేరతారనే వార్తను బిజెపి నాయకులు కూడా పెద్దగా ఖండించడంలేదని, ఈటల బిజెపికి గుడ్ బై చెప్పినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని కమలం పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు వివరించారు. ఎందుకంటే బిజెపిలో ఈటల రాజేందర్ చేరికల కమిటీకి చైర్మన్ గా ఉన్నప్పటికీ ఆయనను తనదైన శైలిలో పనిచేయనీయకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు అనేక అవరోధాలు సృష్టిస్తున్నారని, దాంతో ఈటల రాజేందర్ తీవ్ర మనస్థాపంతో ఉన్నారని అంటున్నారు. అంతేగాక మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఈటల రాజేందరను పనిచేయనీయలేదని, ఈటలకు ఆ ఇద్దరు నేతలు ఏ మాత్రం సహకరించలేదని, అనీ మొక్కుబడి కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకొన్న ఈటల రాజేందర్ ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. అంతేగాక మునుగోడులో గెలవాల్సిన బిజెపి అభ్యర్థి ఓటమి కావడానికి కూడా వీరిద్దరి చర్యలే కారణమనే అంశాలపై ఈటల రాజేందర్ ఢిల్లీ పెద్దలు ఫిర్యాదు చేయనున్నారని ఆ నాయకులు వివరించారు.

బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఎల్లప్పుడూ తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికే పనిచేస్తున్నారని, పార్టీ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని, ప్రెస్ మీట్లలో టి.ఆర్.ఎస్. ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితమవుతున్నారేగానీ పార్టీలోకి చేరాలనుకొంటున్న ఇతర పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించడానికి బండి సంజయ్ పెద్దగా ఆసక్తి చూపించడంలేదని ఈటల రాజేందర్ వర్గీయులంటున్నారు.

టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బండి సంజయ్ చేష్టలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేసినా ఫలితం లేకుండా పోయిందని, చివరకు అది నకిలీ ప్రమాణంగా ప్రజల్లోకి వెళ్ళిందని, ఇలాంటి పరిణామాలు పార్టీకి ప్రయోజనం చేకూర్చకపోగా నష్టదాయకమేనని అంటున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో మధ్యవర్తులుగా పనిచేసిన స్వాములకు బండి సంజయ్ బంధువులే విమాన టిక్కెట్లు బుక్ చేసిన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని అంటున్నారు. అందుకే కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల నుంచి బిజెపిలో చేరాలనుకునే వారు కూడా ఇప్పడున్న పరిస్థితులను చూసి వెనుకంజ వేస్తున్నారని ఈటల వర్గీయులంటున్నారు.

దీనికితోడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో బిజెపితో తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యమించాల్సిందేనని తీసుకొన్న నిర్ణయంతో కమలం పార్టీలో కలవరం మొదలయ్యిందని, కెసిఆర్ ఉద్యమాలు చేపడితే అవన్నీ ప్రత్యర్ధి పార్టీలకు భంగపాటు తప్పదని, కెసిఆర్ ఉద్యమాల వ్యూహాలను అంచనా వేసి అడ్డుకోగలిగిన సత్తా తెలంగాణ బిజెపి నాయకుల్లో ఎవ్వరికీ లేదని అంటున్నారు. కాస్తోకూస్తో కెసిఆర్ వ్యూహాలపై అవగాహన ఉన్న ఈటల రాజేందరు ముందుకు సాగనీయడంలేదని, ఎందుకంటే కెసిఆర్ను ఢీ కొట్టే ప్రయత్నంలో ఈటల రాజేందర్ పై ఢిల్లీ పెద్దలకు మరింత అభిమానం పెరుగుతుందని, అందుకే ఈటలకు అడుగడుగునా బ్రేకులు వేయాల్సిందేనని బండి సంజయ్, కిషన్రెడ్డిలు వ్యూహాత్మకంగానే ఈటలకు అడ్డుపుల్లలు వేస్తున్నారని ఆ నాయకులు వివరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో బిజెపిలో యధావిధిగా కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని, అందుకనే మళ్ళీ టి.ఆర్.ఎస్.లో చేరితే గతంలో కంటే ఈసారి మరింత గౌరవ, మర్యాదలతోనే ఆ పార్టీ అధిష్టానం చూసుకుంటుందనే నమ్మకం, విశ్వాసంతో ఈటల రాజేందర్ వర్గీయులు ఉన్నారని, అయితే ఈటల రాజేందర్ మాత్రం ఇప్పటి వరకూ తన అనుచరులకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని వివరించారు. సోషల్ మీడియాలో మాత్రం ఈటల రాజేందర్ టి.ఆర్.ఎస్.లో చేరబోతున్నారనే వార్తలపై ఆయన అనుచరులు మాత్రం పట్టరాని సంతోషంతో ఉన్నారని, ఈసారి టి.ఆర్.ఎస్.లో చేరితో తమకు తిరుగుండదని వారు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఈటల రాజేందర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి…

ఇవి కూడా చదవండి..

జర్మనీ కాన్సులేట్‌తో కేటీఆర్‌ భేటీ

బీజేపీ మళ్లీ వస్తే దేశం సర్వనాశనం:డి.రాజా

తెలంగాణలో జాకీ గార్మెంట్‌…కేటీఆర్‌

- Advertisement -