సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో మరింత దూకుడు పెంచింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తుండగా మరోవైపు గలాబీ బాస్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది.
పార్టీ ఆవిర్భావం నుండి ఏ కార్యక్రమాన్నైన తనకు అచ్చొచ్చిన కరీంనగర్ నుండే ప్రారంభిస్తున్నారు సీఎం కేసీఆర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నుండి ఎన్నికల శంఖారావం పూరించిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని సైతం కరీంనగర్ నుండే ప్రారంభించనున్నారు.
ఈ నెల 17న కరీంనగర్‌లో,19న నిజామాబాద్‌లో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌లో ఎంపీ స్ధానాలను గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేలపై ఉంచిన కేసీఆర్ 16 నియోజకవర్గాల్లో మీటింగ్స్‌లో పాల్గొంటానని తెలిపారు.
ఇక ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశాన్ని కరీంనగర్ నుండే ప్రారంభించగా కేసీఆర్ సైతం ఇక్కడినుండే భారీ బహిరంగసభను నిర్వహిస్తుండటం పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపనుంది.
ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుండగా అదేరోజు నుండి మార్చి 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 26న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 28 వరకు ఉంటుంది. ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.