గులాబీ జాతరకు పోరాటాల గడ్డ ఓరుగల్లు సిద్దమవుతోంది. టీఆర్ఎస్ పార్టీ 16వ ఆవిర్భావ సభను రైతు జైత్రయాత్రగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ప్లీనరీ విజయవంతంతో మంచి జోష్ మీదున్న పార్టీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో బహిరంగసభకు ప్రజలను సమీకరించే పనిలో ఉన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో పార్టీ నేతులు అహర్నిషలు కష్టపడుతున్నారు. ఇప్పటికే బహిరంగసభ ఏర్పాట్లను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు స్వయంగా పరిశీలించారు.
రేపు సాయంత్రం జరగనున్న బహిరంగసభ నేపథ్యంలో దారులన్నీ వరంగల్ వైపే మారాయి. ప్రతి నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో రైతులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లలో బయలుదేరారు. గతంలో ఎన్నడూ లేనివిదంగా దాదాపు 500 మంది కూర్చోగలిగే సామర్థ్యం ఉన్న 6400 చదరపు అడుగుల విస్తీర్ణం, 10 అడుగులు ఎత్తు ఉన్న వేదికను ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా సాంస్కృతిక శాఖకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. సభా వేదికకు ఆనుకుని భద్రతా వలయం కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. విశాలమైన మీడియా గ్యాలరీ ఉంది. సభా ప్రాంగణంలో అందుబాటులో ఉండేందుకు 6 హెల్త్ క్యాంప్‌లు ప్రముఖ డాక్టర్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి సభలో ప్రభ బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. 16 ఏళ్ల టీఆర్‌ఎస్ ప్రస్థానాన్ని తెలపడంతోపాటు… మూడేళ్ల పాలనకు సంబందించి 30 పథకాలను వివరిస్తూ ట్రాక్టర్లను ప్రభ బండ్ల లాగా అలంకరించనున్నారు.
సభకు వచ్చే ప్రముఖుల కోసం ఫ్రీగా వైఫై సేవలందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మీడియాకు కూడా వైఫై అందుబాటులో ఉంచుతారు. దీని కోసం ప్రైవేటు సంస్థల నుంచి ఇంటర్నెట్ లైన్ తీసుకున్నారు. సభకు వచ్చే వారికి ఎండనుంచి ఉపశమనం కలిగించేందుకు సభా ప్రాంగణంలో వాటర్ ఫాగర్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వాతావరణం చల్లబడి సభకు హాజరై జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువసేపు సభా ప్రాంగణంలో ఉండే అవకాశం ఉంటుంది. నీటి సదుపాయాలకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 10 లక్షల పాకెట్ల మజ్జిగ, 20 లక్షల తాగునీటి పాకెట్లను అందిస్తున్నారు.
ప్రకాశ్‌రెడ్డి పేటలో జరిగే బహిరంగసభతో టీఆర్ఎస్ మరోసారి చరిత్ర తిరగరాయబోతుందని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు అన్నారు. బహిరంగ సభకు ఏర్పాట్లు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఆయన అన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆశీర్వదించేందుకు ప్రజలు సభకు తరలిరావాలని మంత్రి కోరారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రైతుల సంక్షేమానికి కేసీఆర్ పలు పథకాలు ప్రవేశపెట్టారని కడియం తెలిపారు. వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు ఎరువులను అందుబాటులో ఉంచడం, రైతులకు రుణమాఫీ చేశామన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. దీంతో రైతులు స్వచ్చందంగా బహిరంగసభకు తరలివస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల నుంచి రైతులు ఎడ్డ బండ్లతో తరలిరానున్నారు. పార్టీ బహిరంగసభకు నిధులు సమకూర్చేందుకు మంత్రుల దగ్గరి నుంచి గ్రామస్ధాయి కార్యకర్తల వరకు కూలిపనిచేసి నిధులు సమకూరుస్తున్నారు. వరంగల్‌కు దూరంగా ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల నుంచి సభ జరగడానికి రెండు రోజుల ముందే రైతులు బయలుదేరేలా ప్లాన్ చేశారు.కొన్ని జిల్లాల నుంచి మంగళవారమే (25వ తేదీ) పయనమయ్యారు. ఎండలు తీవ్రంగా ఉన్నందు ఉదయం 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 తర్వాత ట్రాక్టర్లు ప్రయాణం చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గ ట్రాక్టర్లలోనే ప్రయాణించనున్నారని చెబుతున్నారు.
టీఆర్ఎస్ బహిరంగ సభకోసం వరంగల్ పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఎక్కడ చూసిన గులాబీ తోరణాలు దర్శనమిస్తున్నాయి. గులాబీ శ్రేణులతోపాటు .. రైతులు, కులవృత్తులవారు ఉద్యోగులు, విద్యార్థులు కూడా మేము సైతమంటూ .. టీఆరెస్ ప్రగతినివేదన సభకు హాజరవుతామంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సభకు తరలివెళ్లేందుకు భారీ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. బహిరంగసభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తికావచ్చాయి.