తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.పలువురు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకి చేరుకున్నారు.
సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. అభ్యర్థులతో పాటు నోటాకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. 117 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు.
ఒక్క అభ్యర్థికి 30మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 90కు తోడు ఎంఐఎం సభ్యుల మద్దతు కలుపుకుని 97కి చేరింది. ఎంఐఎం , టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మూడు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్ ఎమ్మెల్యేలు ఒక్కో అభ్యర్థికి ఓటేసేలా ప్లాన్ చేశారు.
పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్ కుమార్,బండ ప్రకాశ్,బడుగుల లింగయ్యలు బరిలో ఉండగా ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ గెలుపు లాంఛనమే కానుంది. కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ బరిలో ఉన్న కాంగ్రెస్‌కు తగిన బలం లేకపోవడంతో నామమాత్రంగానే ఆయన పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.రాజ్యసభ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వబోమని బీజేపీ,సీపీఎం ప్రకటించాయి.