టీ కాంగ్రెస్‌…’హస్త’వ్యస్తం..!

388
telangana congress
- Advertisement -

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. తెలంగాణ కాంగ్రెస్‌ ఢీలా పడటానికి వంద కారణాలు. అసెంబ్లీ ఎన్నికల దగ్గరి నుంచి వరుస ఓటములు ఓవైపు మరోవైపు కాంగ్రెస్ శాసనమండలి టీఆర్ఎస్‌లో వీలినం..తాజాగా కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించడంతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది కాంగ్రెస్‌. అనంతరం జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికలు,పరిషత్ ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రీపిటైంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పని ఇక అయిపోయినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి.

టికెట్ల కేటాయింపులు, పొత్తులు, ప్రచార వ్యూహం లేక ఎన్నికల్లో బొక్కాబోర్లా పడింది. ఓటమితో నైరాశ్యంలో ఉన్న కేడర్‌లో నైతిక స్థైర్యం నింపే చర్యలేవీ టీపీసీసీ చేపట్టలేదు. ఓటమికి కారణాలేమిటో అధ్యయనం చేయలేదు. దీనికి తోడు శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని మండలి ఛైర్మన్‌ను కలిసేవరకు టీపీసీసీ పసిగట్టలేకపోయింది.

ఇక మండలిలో వ్యూహాన్నే శాసనసభలోనూ టీఆర్‌ఎస్‌ అమలు చేస్తుందని తెలిసినప్పటికీ, పార్టీ నాయకత్వం తగిన విధంగా వ్యవహరించడంలో విఫలమైంది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని సంకేతాలు ఉన్నప్పటికీ, వారితో చర్చించి ఆపడంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తున్న ఢిల్లీ అధినాయతక్వం చూసిచూడనట్లే వ్యహరించడంతో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలిఉండటంతో వీరిలో ఎందరు ఉంటారో, ఎందరు పార్టీ వీడతారో తెలియని అయోమయంలో కాంగ్రెస్‌ కొట్టుమిట్టాడుతోంది.

- Advertisement -