అజ్ఞాతవాసిలో పవన్ కల్యాణ్ నట విశ్వరూపం చూస్తారని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. నోవాటెల్‌లో సినిమా ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడిన త్రివిక్రమ్ పవన్ భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాని తెలిపారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే తనకు గుర్తొచ్చే మాట ఎందరో ‘మహానుభావులు’ అని, ఈ సినిమా కోసం పని చేసిన వాళ్లందరూ చాలా గొప్ప వాళ్లని, ఏ ఒక్కరూ తక్కువ కాదని అన్నారు.
అభిమానులంతా క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి. ఒక్కరికి ఏమయినా కష్టం కలిగినా పవన్ కళ్యాణ్ ఫీలవుతారు. మనం అంతా పవన్ వెనుక వుండాలి. అలా వుండే వాళ్లలో ఒక్క నెంబర్ కూడా తగ్గకూడదు. అందుకే అందరూ క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి.
ఈ సినిమాలో పవన్ నట విశ్వరూపాన్ని చూస్తారు. అంతకన్నా ఆయన గురించి ఇంకేం చెప్పకూడదు. అమ్మ అంటే ఎంత ఇష్టం అయినా మనసులోనే వుంచుకుంటాం. మీరు అందరూ అనుకునే, ఆశించే ఉన్నత స్థాయికి పవన్ చేరుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. బిఎన్ రెడ్డి దగ్గర నుంచి రాజమౌళి వరకు ఎందరో మహానుభావులు. వారందరికీ వందనాలు. ఎన్టీఆర్,ఎఏన్నాఆర్ దగ్గర నుంచి చిరంజీవి,పవన్ వరకు ఎందరో మహానుభావులు అందరికి వందనాలు అని తెలిపారు.
ఈ చిత్రంలో ప్రధానపాత్ర పోషించిన సీనియర్ నటి ఖుష్బూకు తాను కథ చెప్పడానికి వెళ్లినప్పుడు.. ‘నచ్చింది పో’ అని అన్నారని గుర్తుచేసుకున్నారు. హీరోయిన్లు కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయ్యేల్ ఏ రోజూ షూటింగ్ కు ఆలస్యంగా రాలేదని, వాళ్ల నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నానని.. ఇలా చిత్రయూనిట్ లోని ప్రతి ఒక్కరి నుంచి తాను ఎంతో కొంత నేర్చుకున్నానని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.