టాలీవుడ్ తార త్రిష ఇప్పుడు మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రిషకి గ్లామర్ రోల్స్ చేసే అవకాశాలు రావడం లేదనుకుంటా అందుకే గత కొంతకాలంగా ‘నాయకి’ ‘కళావతి’ లాంటి హారర్ థ్రిల్లర్ చిత్రాలు చేస్తూ వస్తోంది. అయినా ఆ చిత్రాలతో ఈ భామకు చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం రాలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు త్రిష చేయబోయే చిత్రం కూడా హారర్ థ్రిల్లర్ చిత్రమే.
ఇప్పుడు త్రిష నటిస్తున్న తాజా చిత్రం ‘మోహిని’. ఈ చిత్రానికి మాదేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో త్రిష.. చెఫ్ గా పనిచేయడం కోసం లండన్ వెళుతుంది. అక్కడ ఆమెను ఒక దెయ్యం వెంటాడుతూ వేధిస్తూ ఉంటుంది. త్రిషను అంతగా భయపెట్టే ఆ దెయ్యం కూడా త్రిషనే కావడం విశేషం.
ఇందులో భయపెట్టే పాత్రలోనూ.. భయపడే పాత్రలలోనూ త్రిష కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా లండన్ లో జరుపుకొని ఇప్పుడు విడుదలకు సిద్దమవుతోంది. మరి అందరి హీరోయిన్లలా కాకుండా ఇలాంటి పాత్రలను ఎంచుకొని విజయం కోసం తహతహలాడుతున్న ఈ భామ ‘మోహిని’గా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి మరి.