ఐపీఎల్-10 ఆరంభంలో తడబడి, ఆపై పుంజుకుని జైత్రయాత్ర సాగిస్తున్న పుణె సూపర్ జెయింట్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కోల్‌కతాను దాని సొంతగడ్డపై ఓడించి ప్లే ఆఫ్ ఆశలను మెరుగుపర్చుకుంది. కోల్ కతా విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కొల్పోయి ఘనవిజయం సాధించింది. ఈ సీజన్లో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన ఆ జట్టు యువ ఓపెనర్ రాహుల్ త్రిపాఠి.. మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. సహచరులంతా క్రీజులో నిలవలేకపోతుంటే.. త్రిపాఠి (93; 52 బంతుల్లో 9×4, 7×6) మాత్రం అలవోకగా నైట్‌రైడర్స్ బౌలర్లను ఎదుర్కొని శతక సమాన ఇన్నింగ్స్‌తో జట్టుకు విలువైన విజయాన్నందించాడు.
రహానె 11 పరుగులకే ఔటవ్వగా… స్మిత్ 9 పరుగులకే వెనుదిరిగాడు. మనోజ్ తివారి (8)ది వైఫల్యమే. స్టోక్స్ (14) కూడా ఎంతోసేపు నిలవలేదు. ధోని (5) కూడా విఫలమయ్యాడు. అయినా పుణె గెలిచిందంటే త్రిపాఠి వల్లే. మరో ఎండ్‌లో క్రమం తప్పకుండా వికెట్లు కూలుతున్నా.. వోక్స్, ఉమేశ్ యాదవ్ (1/23), నరైన్ (1/28) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడి పెంచుతున్నా.. త్రిపాఠి ఆగలేదు. తనకు తేలిగ్గా అనిపించిన బౌలింగ్‌ను వదిలిపెట్టలేదు.
అంతకముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. మనీష్ పాండే 37, గౌతమ్ గంభీర్ 24 రన్స్ తో మ్యాచ్ ను నిలబెట్టారు. చివర్లో గ్రాండ్‌హొమ్మి 19 బంతుల్లో 36 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 30 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.