విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన గిరిజనులు..

18

హిందూ ధర్మాన్ని అనుసరించే మహిళల కట్టు – బొట్టు భారతీయతను ప్రతిబింబిస్తాయని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. పసుపు కుంకుమలతో మహిళలు సౌభాగ్యంగా కనిపించేది కేవలం హిందూ ధర్మంలో మాత్రమేనని స్పష్టం చేశారు. అరకు, పాడేరు ప్రాంతాల నుంచి శనివారం విశాఖ శ్రీ శారదాపీఠానికి గిరిజనులు వచ్చారు. ఆనవాయితీ ప్రకారం తమ తొలి పంటలో కొంతభాగాన్ని సింహాద్రి అప్పన్నకు సమర్పించేందుకు గిరిజనులంతా విశాఖ వచ్చారు.

అప్పన్న దర్శనానికి వెళ్లే ముందు విశాఖ శ్రీ శారదా పీఠానికి చేరుకున్నారు. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్బంగా గిరిజనులతో స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడారు. ఇతర మతాల వలలో పడొద్దని హితవు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో హిందూ ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. గ్రామ దేవతలను ఆరాధించాలన్నారు. ఆదివాసీలకు అప్పన్న ఆశీస్సులు, రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆకాంక్షించారు.