హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రికార్డు స్థాయి డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయడానికి ట్రాన్స్ కో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించింది. టవర్లు నిర్మించకుండానే, కొత్త లైను వేయకుండానే ప్రస్తుతమున్న లైన్లకే హై టెంపరేచర్ లా సాగ్ (హెచ్.టి.ఎల్.ఎస్.) కండక్టర్లను అమర్చింది. హైదరాబాద్ నగరంలో 70 కిలోమీటర్ల డబుల్ సర్క్యూట్ 220 కెవిలైనులో సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. దీని ద్వారా ట్రాన్స్ కో రూ.1100 కోట్లను ఆదా చేయగలిగింది. మూడేళ్ళ సమయంలో జరిగే పనిని కేవలం మూడు నెలల్లో పూర్తి చేసింది. సామర్థ్యం పెంచడానికి ఏర్పాటు చేసిన కండక్లర్లను విద్యుత్ సౌధలోని లోడ్ డిస్పాచ్ సెంటర్ లో ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు బుధవారం ప్రారంభించారు.
ఎక్కువ లోడ్ కలిగిన లైన్లో సామర్థ్యం పెంపు వల్ల హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరాలో అప్పుడప్పుడు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించడం సాధ్యమవుతుంది. నగరంలో పారిశ్రామిక, వాణిజ్య, గృహ విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతున్నది. గతేడాది 2,950 మెగావాట్ల గరిష్ట డిమాండ్ రాగా, ఈ ఏడాది 3,276 మెగావాట్ల డిమాండ్ వచ్చింది. దీంతో ప్రస్తుతమున్న లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లపై వత్తిడి అధికమైంది. ఎక్కువ లోడ్ కలిగిన రూట్లలో సరఫరాలో అప్పుడప్పుడు అవాంతరాలు కూడా ఎదురయ్యాయి. 400 కెవి లైన్ల నుంచి 220 కెవి విద్యుత్తును తీసుకొచ్చే మామిడిపల్లి – శివరామ్ పల్లి, మల్కాపురం – షాపూర్ నగర్, శంకరపల్లి-గచ్చిబౌలి లైన్లపై అధిక వత్తిడి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ లైన్లలో సామర్థ్యాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు.
ఈ మూడు లైన్లు కలిపి దాదాపు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొత్తగా టవర్లు నిర్మించి, 220 కెవి లైన్లు వేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇలా చేయడం వల్ల ట్రాన్స్ కో పై రూ.1200 కోట్ల వ్యయం అవుతుంది. టవర్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున భూసేకరణ జరపాల్సి వచ్చేది. పైగా మూడేళ్ల సమయం పట్టేది. దీన్ని నివారించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంది. ఇతర దేశాల్లో అవలంభిస్తున్న ఈ విధానం ప్రకారం టవర్లు, లైన్లు నిర్మించకుండానే ప్రస్తుతమున్న లైన్ల సామర్థ్యాన్ని ప్రత్యేక కండక్టర్లు అమర్చడం ద్వారా పెంచవచ్చు. ఈ కండక్టర్ల సామర్థ్యాన్ని మొదట నార్కట్ పల్లి ప్రాంతంలో 20 కిలోమీటర్ల 132 కెవి లైన్లలో పరీక్షించారు. ట్రాన్స్ కో సాంకేతిక బృందం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత హైదరాబాద్ లో ఈ కండక్టర్లను వాడాలని సిఫారసు చేసింది.
‘‘కేవలం 100 కోట్ల వ్యయంతోనే కండక్టర్లను ఏర్పాటు చేసి, సామర్థ్యం పెంచవచ్చు. నగరంలో టవర్ల నిర్మాణానికి కావాల్సిన స్థలం సేకరించడం కూడా హైదరాబాద్ నగరంలో అంత తేలిక కాదు. పైగా టవర్లు, లైన్ల నిర్మాణానికి మూడేళ్ల సమయం పడుతుంది. కాబట్టి కండక్టర్లు వాడడం ఉత్తమం’’ అని నిపుణులు తేల్చిచెప్పారు. దీంతో ట్రాన్స్ కో పైన చెప్పిన మూడు ప్రధాన రూట్లలో హెచ్.టి.ఎల్.ఎస్. కండక్టర్లను అమర్చాలని నిర్ణయించింది. మూడు నెలల సమయంలోనే కండక్టర్లను ఏర్పాటు చేసింది. టెస్ట్ రన్ కూడా విజయవంతం చేసిన తర్వాత, బుధవారం నుంచి అధికారికంగా ఈ మూడు లైన్లలో కండక్టర్లను అనుసంధానం చేశారు. దీంతో నగరంలో విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగైంది.
ప్రస్తుతం 3,276 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నగరంలో ఏర్పడుతున్నది. ఏటా దాదాపు పదిశాతం డిమాండ్ పెరుగుతున్నది. ప్రస్తుతం అమర్చిన కండక్టర్ల ద్వారా నగరానికి 4వేలకు పైగా డిమాండ్ ను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. అంటే మరో మూడేళ్ళ వరకు కూడా ఎలాంటి ఢోకా లేకుండా నగరానికి విద్యుత్ సరఫరా చేయవచ్చు. రూ.1100 కోట్లు ఆదా చేసి, మూడేళ్ల సమయాన్ని మూడు నెలలకు తగ్గించి, ఎవరికీ ఆటంకం కలగకుండా, హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరా పరిస్థితిని మెరుగుపర్చామని, రాబోయే కాలంలో కూడా నగరంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు ఈ సందర్భంగా చెప్పారు.
ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో డైరెక్టర్లు జగత్ రెడ్డి, నర్సింగ్ రావు, లోడ్ డిస్పాచ్ సిఇ భాస్కర్, ఎస్.ఇ. సురేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతున్నది. ఎంతగా అంటే మొత్తం ఏడు ఈశాన్య రాష్ట్రాలు వాడుతున్న కరెంటు కంటే, హైదరాబాద్ నగరం వాడుతున్న కరెంటు ఎక్కువ. హైదరాబాద్ నగరం వాడే కరెంటు కంటే, దేశంలోని 13 రాష్ట్రాల్లో మొత్తం రాష్ట్ర వినియోగం ఉంది. దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలన్ని కలిపి కూడా హైదరాబాద్ నగరం వాడేంత కరెంటు వాడడం లేదు. ఈ ఏడాది గరిష్ట డిమాండ్ గతంలో ఎన్నడూ లేని విధంగా 3,276 మెగావాట్లకు చేరుకున్నది.
గత ఏడాది వేసవిలో 2,950 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చింది. ఈ ఏడాది డిమాండ్ లో పదిశాతం వృద్ధి సాధించింది. హిమాచల్ ప్రదేశ్(1,387), జమ్మూకాశ్మీర్(2,826), ఉత్తర ఖండ్(1,922), గోవా(594), సిక్కిం(100), జార్ఖండ్(1,266), అస్సాం(1,712), అరుణాచల్ ప్రదేశ్(139), మణిపూర్(197), మేఘాలయ(336), మిజోరం(116), నాగాలాండ్(157), త్రిపుర(292) రాష్ట్రాలు హైదరాబాద్ నగరం కంటే తక్కువ కరెంటు వాడుతున్నాయి. మొత్తం ఏడు ఈశాన్య రాష్ట్రాలు కలిపి వాడే కరెంటు 2,848 కన్నా హైదరాబాద్ నగరం వాడే కరెంటు ఎక్కువ. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ఐటి పరిశ్రమ వృద్ధి, వాణిజ్య కనెక్షన్లు పెరగడం, గృహ ఉపయోగం పెరగడం వల్ల ఈ వృద్ధి జరుగుతున్నది.
తెలంగాణ ఏర్పడిన నాడు నగరంలో 37.8 లక్షల ఎల్.టి. విద్యుత్తు కనెక్షన్లు ఉంటే, నేడు 47.8 లక్షల కనెక్షన్లున్నాయి. ఎల్.టి. కనెక్షన్లలో 27 శాతం వృద్ది సాధించింది. 2014లో 7,067 హెచ్.టి. విద్యుత్ కనెక్షన్లుంటే, నేడు 7,015కు పెరిగాయి. హెచ్.టి. కనెక్షన్లలో 39 శాతం వృద్ధి జరిగింది. అన్నింటికీ మించి 24 గంటల విద్యుత్ సరఫరా జరగడం వల్ల పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి. ‘‘హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ. కాబట్టి నగరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశ్రమలు, వ్యాపారం, వాణిజ్యం, కార్యాలయాలు అన్నీ కరెంటుపై ఆధారపడి నడుస్తున్నాయి.
ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా, సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో విద్యుత్ డిమాండ్ లో 10 శాతం స్థిరమైన వృద్ధి ఉంటుందని అంచనా వేశాము. డిమాండ్ కు తగినట్లు విద్యుత్ సరఫరా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే నగరం చుట్టూ 400 కెవి రింగును ఏర్పాటు చేశాం. నాలుగు 400 కెవి సబ్ స్టేషన్లు నిర్మించాం. అక్కడి నుంచి 220 సబ్ స్టేషన్ల కు విద్యుత్ సరఫరా చేసే లైన్ల సామర్థ్యం ఎప్పటికప్పుడు పెంచుతున్నాం’’ అని ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు తెలిపారు.