సినీ ప్రముఖులు పాల్గొనే టాలీవుడ్ ప్రొ లీగ్ (టీపీఎల్) క్రికెట్ టోర్నీ ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులతో పాటు సినిమా ప్రేమికుల్లోనూ ఈ లీగ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు పాల్గొనే ఈ టోర్నీని హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ (HICC)లో టాలీవుడ్ ప్రొ లీగ్ ట్రోఫీతో పాటు జెర్సీని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సందడి వాతావరణంలో జరిగింది. లీగ్‌కు సంబంధించిన జెర్సీలు, ట్రోఫీ ఆవిష్కరణతో పాటు నిర్వాహకులు టోర్నీ షెడ్యూల్, జట్ల వివరాలను కూడా వెల్లడించారు.
ఈ వేడుకలో భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారితో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నటుడు సోనూ సూద్, సంగీత దర్శకుడు తమన్, నటి రాశీ ఖన్నా, అలాగే నిర్వాహకుల్లో ఒకరైన వంశీ చాగంటి హాజరయ్యారు. సెలబ్రిటీలు, క్రికెట్ లెజెండ్స్ ఒకే వేదికపై కనిపించడంతో కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారింది.
టాలీవుడ్ ప్రొ లీగ్ ద్వారా క్రీడలతో పాటు వినోదాన్ని మేళవిస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో నిర్వాహకులు ముందుకు వస్తున్నారు. ఈ టోర్నీ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురానుంది.
Also Read:కోడిగుడ్లతో క్యాన్సర్ ప్రమాదం లేదు!
ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమయ్యే ఈ లీగ్ మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరవుతారని, హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు ఇది ఒక పండుగలా మారనుందని నిర్వాహకులు తెలిపారు.

