డ్రగ్స్ వ్యవహారంతో టాలీవుడ్‌కి లింక్ ఉండటంతో తెలుగు సినీ రంగం పరువు మొత్తం గంగలో కలిసింది. ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న వార్తలతో టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన 40 మంది ప్రముఖుల పేర్లు ఉన్నట్టు సమాచారం. అయితే తొలుత 12 మందికి ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసింది.మిగతా వాళ్లకు త్వరలో నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులు జారీ అయిన వారిలోయువ హీరోలు, దర్శకులు, నిర్మాతలు అసిస్టెంట్లు ఉన్నారు. తాజాగా ఎక్సైజ్ శాఖ నుంచి విచారణను ఎదుర్కోనున్న వారి పేర్లు వెల్లడయ్యాయి. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో హీరో రవితేజ, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, నవదీప్, శ్రీనివాసరావు, తనీష్, నందు తదితరులు ఉన్నారు.
వీరంతా ఈ నెల 19 నుంచి 27 వరకూ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి వుంది. వీరంతా ఆరు రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగానే హాజరు కావాలని, రాకుంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. పక్కాగా సాక్ష్యాలు లేకుండా తాము ఎవరినీ పిలవదలచు కోలేదని, సాక్ష్యం ఉందని భావించిన తరువాతే నోటీసులు పంపామని అకున్ సబర్వాల్ వెల్లడించారు. ఒకసారి నోటీసు ఇచ్చిన తరువాత వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పరిశ్రమకు చెందిన పలువురికి నోటీసులు జారీ అయ్యాయనే వార్తలతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది.