హైదరాబాద్ నగరంలో ప్రతిజోన్‌లో 500 చొప్పున మొత్తం 3వేల పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి అందుబాటులో ఉన్న స్థలాలను బట్టి అనువైన డిజైన్లను ఎంపిక చేయాలని అధికారులకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ సూచించారు. మంగళవారం పురపాలక శాఖ కార్యాలయంలో ముంబాయికి చెందిన సంస్థ పది రకాల పబ్లిక్ టాయిలెట్ల డిజైన్ల పై ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఆయా డిజైన్ల గురించి పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లకు ఆ సంస్థ ఆర్కిటెక్ట్ కల్పిత్ ఆశర్ వివరించారు.
వివిధ వర్గాల ప్రజలు, ప్రయాణికుల వినియోగానికి అనుగుణంగా పోర్టబుల్ టాయిలెట్స్, బస్టాప్, రైల్వే, పేవ్‌మెంట్, హై-వే, అర్భన్, అంగన్‌వాడి, కమ్యునిటి, పార్కు టాయిలెట్ల డిజైన్లతో పాటు ప్రత్యేకంగా మహిళల టాయిలెట్లకై డిజైన్లను ప్రదర్శించారు. పర్యావరణ హితంగా పలు అంశాలను పరిగణలోకి తీసుకొని శానిటేషన్, టెక్నాలజి, రీసైక్లింగ్ సిస్టం, నిర్వహణ, నిర్మాణ శైలీ గురించి వివరించారు. ప్రస్తుతం రాజస్థాన్ లోని జైపూర్, ఉదయ్‌పూర్, అజ్మీర్, బికనీర్, కోటతో కలిపి ఏడు పట్టణాల్లో 34 ప్రదేశాల్లో ఈ ఆధునిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అర్వింద్ కుమార్ మాట్లాడుతూ… పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశాల మేరకు పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఆయా ప్రాంతాలకు అనువైన డిజైన్లను సూచించాలని ఆర్కిటెక్టర్‌ను కోరారు. టాయిలెట్ల నిర్మాణంలో అన్ని విభాగాల ఇంజనీరింగ్ అధికారులను నిమగ్నం చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్‌కు సూచించారు.