కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 20వ తేదీ వరకు అత్యంత నిరాడంబరంగా, వేదమంత్రాల నడుమ ఈ వేడుకలు కనులపండువగా సాగుతున్నాయి. ఈ పవిత్ర ఉత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దింది.
బ్రహ్మోత్సవాల వేళ తిరుమల క్షేత్రం అపూర్వమైన పూల శోభతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశ విదేశాల నుంచి సేకరించిన రకరకాల సువాసన వెదజల్లే సుందరమైన పుష్పాలతో ఆలయ ప్రాంగణమంతా కళకళలాడుతోంది.
ఈ తొమ్మిది రోజుల ఉత్సవాల కోసం టీటీడీ ఉద్యానవన విభాగం సుమారు 60 టన్నుల సంప్రదాయ మరియు విదేశీ పూలను ఉపయోగించింది.గర్భాలయంలో కొలువుదీరిన శ్రీవారి మూలవిరాట్ అలంకరణ కోసం ప్రత్యేకంగా 4.7 టన్నుల అత్యుత్తమ నాణ్యత గల పూలను కేటాయించారు.
ధ్వజస్తంభం, బలిపీఠం, మహాద్వారం, రంగనాయకుల మండపం వంటి ప్రధాన ప్రాంతాలను దాదాపు 4 లక్షల కట్ ఫ్లవర్స్‌తో (Cut Flowers) అత్యంత మనోహరంగా అలంకరించారు.వివిధ వాహన సర్వాలు, గోపురాలు, మండపాలు, క్యూలైన్ల అలంకరణను కలుపుకుంటే మొత్తం దాదాపు 70 టన్నుల పూలతో తిరుమల క్షేత్రం దివ్యశోభను సంతరించుకుంది.
Also Read:టీ20ల్లో తిలక్ అరుదైన ఘనత..
ఉత్సవాల సమయంలో ప్రతిరోజూ వివిధ వాహనాలపై భక్తులకు అభయమివ్వనున్న శ్రీమన్నారాయణుడు, ఈ ప్రత్యేక పుష్పాలంకరణల మధ్య మరింత దివ్యంగా దర్శనమిస్తున్నారు. ఈ అద్భుతమైన అలంకరణలను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న వేలాది మంది భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది.

