రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారం రేపడమే కాదు తెలుగు సినీపరిశ్రమను అతలాకుతలం చేసిన మత్తుమందుల వ్యవహారం ఇక ముగిసిన అధ్యాయమేనా! కొద్దిరోజులుగా ఈ కేసులో ఎలాంటి అలికిడీ లేకపోవడంతో అందరి మదిలో మెదులుతున్న అనుమానం ఇది. ఒత్తిడికి తలొగ్గి కేసు పక్కన పెట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బయట ప్రచారం ఎలా ఉన్నా మాదకద్రవ్యాల కేసులు దర్యాప్తునకు ఆబ్కారీశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తమపని తాము చేసుకుంటూ పోతున్నారు. హడావుడి లేకుండా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
డ్రగ్స్ కేసుకు సంబందించి తాజాగా మరో ముగ్గురు సినీ తారలకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు ప్రముఖ సినీ హీరోయిన్ అయితే.. మరో ఇద్దరు మాత్రం ప్రముఖ సినీ కుటుంబాలకు చెందిన సినీ తారలుగా చెబుతున్నారు. డ్రగ్స్ వినియోగం విషయంలో ఈ ముగ్గురికి నేరుగా సంబంధాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా ఒక ప్రముఖ హీరోయిన్ కు సంబంధించి బయటకు వస్తున్న సమాచారం ఆశ్చర్యకరంగా మారింది. ఆ మధ్యన జరిగిన ఒక సినీ ఫంక్షన్కు సదరు హీరోయిన్ తనతో పాటు డ్రగ్స్ ను వేడుకకు తీసుకొచ్చిందని.. అందరి ముందే దాన్ని తీసుకుందని.. డ్రగ్ ను సేవించిన తర్వాత ఆమె పడిపోయిందని.. ఆమెను తీసుకొని మరో నటుడు ఆమెను ఇంటికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఒకటి అధికారులు సేకరించారని.. మిగిలిన వివరాలకు సంబంధించిన ఆధారాల్ని సేకరించే పని మీద పడినట్లుగా తెలుస్తోంది.
ఆ మధ్యన 11 మంది సినీ ప్రముఖుల్ని విచారించే సమయంలో వారు చెప్పిన సమాచారంతోనే ఈ ముగ్గురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. తాజాగా నోటీసులు ఇవ్వాలనుకుంటున్న హీరోయిన్ కు.. మిగిలిన ఇద్దరు సినీ నటులను రహస్యంగా విచారించాలా? లేక.. అందరి మాదిరే నోటీసులు ఇచ్చి విచారించాలా? అన్నది ఇంకా తేల్చుకోలేదని చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ అంశం బయటకు రానున్నట్లుగా తెలుస్తోంది.