రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్‌..

71
kcr
- Advertisement -

రైతులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. యాసంగిలో పండిన ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ ఏడు యాసంగి సీజన్‌లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. క్వింటాల్‌ ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

కేంద్ర నిర్ణయం రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారింది దుయ్యబట్టారు. ఐతే ప్రజలతో, రైతులతో నిత్య ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల పట్ల నిబద్ధతను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి అన్నారు. వద్దన్నా రాష్ట్రంలో కొంతమంది రైతులు వరి సాగు చేశారు. ఇప్పుడా వరి కొనుగోలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెనుభారంగా మారింది. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించిన కేబినేట్ కన్న బిడ్డలను కాపాడుకునే తండ్రి మనస్తత్వంతో రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది అన్నారు.

సివిల్ సప్లైస్ శాఖ యుద్ధ ప్రాతిపదికన గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని, మంత్రులందరూ తమ తమ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటును పర్యవేక్షించాలనీ, కలెక్టర్లతో, సంబంధిత శాఖలతో సమీక్షలు నిర్వహించుకొని, గన్నీ బ్యాగుల సరఫరా, తదితర సమస్యలు లేకుండా సమర్థవంతంగా కొనుగోలు జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. గతంలో మాదిరిగానే కనీస మద్దతు ధర చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది కనుక రాష్ట్రంలోని రైతులెవరూ తక్కువ ధరకు ధాన్యం ఇతరులకు అమ్మి, నష్టపోవద్దని ముఖ్యమంత్రి సూచించారు.

కేంద్రం దుర్మార్గ వైఖరి ప్రదర్శిస్తున్నా సరే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖజానాపై పడే అధిక భారాన్ని భరిస్తూ, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తుందనీ ముఖ్యమంత్రి తెలిపారు. యాసంగి వడ్లను కొనేందుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటి వేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -