రోజురోజుకు పెరుగుతున్న పెట్రో ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తుండగా బడ్జెట్‌లో కేంద్రం షాకిచ్చింది. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ పేరుతో పెట్రోల్‌పై రూ.2.5, డీజిల్‌పై రూ.4 సెస్ విధించారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులు మండిపడుతున్నారు. బడ్జెట్‌లో ఊరట కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సామాన్యుల నడ్డీ విరిచేలా కేంద్రం వ్యవహరించిందని మండిపడుతున్నారు.
ఇక బడ్జెట్‌లో ప్రైవేటీకరణ దిశగా ముందడుగు వేశారు నిర్మలా సీతారామన్. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ని ప్రైవేటీకరించనున్నట్లు తేల్చి చెప్పారు. ఎల్ఐసీని ప్రైవేటీకరించి ప్రభుత్వ నిధులను, ప్రజలు బీమా పాలసీలు కొనుగోలు చేయడం ద్వారా పొదుపు చేసిన సొమ్మును బహిరంగ మార్కెట్‌లోకి పంపేందుకు కూడా కేంద్రం వెనుకాడటం లేదు.