తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు మరోవైపు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న నిధులకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు పైన మంత్రి కే. తారకరామారావు ఈ రోజు ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో సగం మాత్రమే తెలంగాణకి తిరిగి వస్తున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు 2,75,926 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం టాక్స్ ల రూపంలో తీసుకుందని అయితే కేవలం లక్షా 40 వేల 329 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర జిఎస్టిడిపి మరియు తలసరి ఆదాయం సైతం భారీగా పెరిగిందని ముఖ్యంగా కీలకమైన రంగాల్లో పెట్టుబడులతో పాటు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసిన మూలధన వ్యయం ఫలితంగానే ఇది సాధ్యమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించి అప్పులు మరియు జిఎస్డిపి రేషియో 22.8 శాతంగా ఉన్నదన్నారు. దేశంలో రుణాలు మరియు జిఎస్డిపి రేషియో తక్కువ కలిగిన ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సమ్మిళితమైనదని ముఖ్యంగా వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్ వంటి అన్ని రంగాల్లోనూ వృద్ధి కొనసాగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2014- 2020 మధ్యలో భారతదేశ తలసరి ఆదాయం 54.9 శాతంగా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం భారీగా పెరిగి 83.9 శాతంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన నాయకత్వం ముఖ్యమంత్రి గారు చేపట్టిన అపూర్వమైన పరిపాలన విధానాల వల్లనే రాష్ట్ర జిడిపి భారీగా పెరిగిందని, ఇది దేశ సగటు కంటే అధికంగా ఉన్నదని మంత్రి అన్నారు. అద్భుతమైన నాయకత్వం, ప్రగతిశీల విధానాలు, క్షేత్రస్థాయి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి పథన దూసుకెళ్తున్నదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.