మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భంగా 1947 ఆగస్టు 14వ తేదీ అర్థరాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఆ తర్వాత స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1997లో ఇలాంటి వేడుకను సెంట్రల్ హాల్లోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశం పేరుతో అర్థరాత్రి పూట నిర్వహించారు. ఇప్పుడు మరోసారి 2017 జూన్ 30 చారీత్రాత్మక రోజు కాబోతుంది. శుక్రవారం అర్ధరాత్రి పార్లమెంటు సెంట్రల్‌హాల్ నుంచి అతిపెద్ద ఆర్థిక సంస్కరణ భావిస్తున్న జీఎస్టీని కేంద్రం లాంఛనంగా ప్రారంభించనుంది కేంద్ర ప్రభుత్వం.
పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా శుక్రవారం అర్థరాత్రి జరగబోయే వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులతో పాటు అనేకమంది ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ఈ మేరకు వీరందరికీ ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి. టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్ రతన్ టాటా, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, ప్రఖ్యాత గానకోకిల లతా మంగేష్కర్ సహా అనేక మంది ప్రముఖుల రాకతో వేదికంతా కాంతులీననుంది.
దేశ పన్నుల శకంలోనే అత్యంత ప్రధాన మార్పునకు సంబంధించిన ఈ కార్యక్రమం రాత్రి సరిగ్గా 11 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. అర్థరాత్రి దాటే వరకు కొనసాగుతుంది. తద్వారా దేశంలో జీఎస్టీ శకం అమల్లోకి వచ్చినట్లవుతుంది. పార్లమెంటు ఉభయ సభలకు చెందిన సభ్యులందరినీ వేడుకకు ఆహ్వానిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ లేఖలు పంపించారు.
జీఎస్టీ అమల్లోకి రావడాన్ని సూచించేలా సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు జేగంట మోగిస్తారు. యితే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు ఈ కార్యక్రమానికి గైర్హాజరవుతున్నాయి. జీఎస్టీని వ్యతిరేకించకపోయినా వివిధ కారణాలతో ఈ పార్టీలు గైర్ఱాజరవుతున్నాయి. కాంగ్రెస్, తృణమూల్, సీపీఐ, ఆర్జేడీలు ఈ కార్యక్రమాన్ని వేర్వేరు కారణాలతో బహిష్కరిస్తుండగా సీపీఎం మాత్రం బహిష్కరించకపోయినా గైర్హాజరవుతున్నట్లు పేర్కొంది.