దుర్గంచెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్‌తో కలిసి పరిశీలించారు. రూ. 180 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే హైదరాబాద్ నగరానికి సరికొత్త ఆకర్షణతో పాటు పర్యాటక రంగంలో మరో ఐకానిక్ రూపొందనుంది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఇంజనీరింగ్ డైరెక్టర్ వెంకటనర్సింహారెడ్డి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్‌ల విభాగం చీఫ్ ఇంజనీర్ శ్రీధర్‌లతో కలిసి ఈ పనుల పురోగతిని పరిశీలించారు. దుర్గం చెరువు పనులను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు రెండు మిలియన్ల పని గంటలను ఏవిధమైన ప్రమాదం లేకుండా రికార్డు స్థాయిలో పూర్తిచేయడం జరిగిందని, ఈ ప్రాజెక్ట్ పనులను నిర్వర్తిస్తున్న ఇంజనీర్లు తెలియజేశారు.
సిమెంట్ కాంక్రిట్ ద్వారా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి 238 మీటర్ల పొడవుతో సిమెంట్ కాంక్రీట్ బ్రిడ్జి నిర్మించడం ప్రపంచంలోనే మొదటిదని వివరించారు. మొత్తం ఈ బ్రిడ్జి నిర్మాణానికి 53 సిమెంట్ కాంక్రీట్ సెగ్మెంట్‌లను అమర్చాల్సి ఉండగా 13 సెగ్మెంట్‌లను అమర్చడం పూర్తి అయ్యిందని ఇంజనీర్లు తెలిపారు. కొండాపూర్‌లో ముందుగా ఈ సెగ్మెంట్‌ల నిర్మాణాలను పూర్తిచేసి రాత్రివేళలో రోడ్డు మార్గం ద్వారా తెచ్చి దుర్గంచెరువు పై అమర్చడం జరుగుతుందని తెలిపారు. ఒకొక్కటి 25 మీటర్ల పొడవు 6.5 మీటర్ల ఎత్తుతో ఉండే కాంక్రీట్ సెగ్మెంట్‌లను అత్యాధునిక, సాంకేతిక పద్దతిలో అమర్చుతున్నామని పేర్కొన్నారు.