కాంగ్రెస్, బీజేపీ.. ‘మేనిఫెస్టో’లో గెలుపెవరిది?

17
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ప్రధాన పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి రావలనే లక్ష్యంతో ఇటీవల కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మేనిఫెస్టోలో ఐదు అంశాలను ప్రస్తావిస్తూ 25 గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. గ్యారెంటీ హామీల పేరుతో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ కేంద్రంలో కూడా అధికారం కోసం గ్యారెంటీ హామీలనే నమ్ముకుంది. ఆ హామీలను మరువక ముందే తాజాగా బీజేపీ కూడా మూడో సారి అధికారమే లక్ష్యంగా సంకల్ప్ పత్ర్ పేరుతో మోడీ కీ గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టోలో 14 అంశాలను ప్రస్తావిస్తూ అన్నీ వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా మేనిఫెస్టో రూపొంచిందినట్లు ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. .

ఇక కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల నుంచి కూడా మేనిఫెస్టో బయటకు రావడంతో ఏ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉందనే ప్రశ్న తెరపైకి రావడం సహజం. అయితే కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇటు బీజేపీ అభివృద్ధి లక్ష్యంగా మేనిఫెస్టోలో హామీలను హైలెట్ చేస్తోంది. 2047 నాటికి భారత్ ను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేనిఫెస్టో రూపొందించినట్లు కమలనాథులు చెబుతున్నారు. దీంతో ఒక పార్టీ సంక్షేమం మరో పార్టీ అభివృద్ది అంశాలను హైలెట్ చేస్తుండడంతో దేశ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి రేపుతున్న అంశం. ఈసారి ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలని ఎన్డీయే కూటమి భావిస్తున్న సంగతి తెలిసిందే. అటు ఇండియా కూటమి ఎలాగైనా ఎన్డీయే కూటమికి చెక్ పెట్టాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను ఆకర్షించే వ్యూహంతో ఉన్నాయి. మరి దేశ ప్రజలు ఏ పార్టీకి అండగా నిలబడతారో చూడాలి.

Also Read:అన్నింటికీ సమాధానం గీతాంజ‌లి 3లో ఉంటుంది!

- Advertisement -