Tuesday, November 5, 2024
Home టాప్ స్టోరీస్ కరెంటు కష్టాలు.. క్లారిటీ వచ్చేనా ?

కరెంటు కష్టాలు.. క్లారిటీ వచ్చేనా ?

29
- Advertisement -
తెలంగాణలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చే హామీని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైన సంగతి తెలిసిందే. మార్చి నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు సి‌ఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అర్హులైన వారిని గుర్తించే పనిలో ఉంది రాష్ట్ర విద్యుత్ శాఖ. అయితే ఈ పథకాన్ని అందరికీ అందజేస్తారా లేదా ఇందులో కూడా షరతులు వర్తిస్తాయా ? అనే దానిపై మాత్రం ఇంతవరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ప్రజలు తీవ్ర గందరగోళానికి లోనవుతున్నారు. ప్రభుత్వ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలనే ప్రామాణికంగా తీసుకొని గృహజ్యోతి పథకాన్ని అమలు చేసేలా కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరి వైట్ రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఎంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజాపాలనలో భాగంగా వైట్ రేషన్ కార్డుల కొరకు ఎంతో మంది దరఖాస్తులు చేసుకున్నారు. మరి వాటి జారీపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అంతే కాకుండా సొంతుళ్లలో రేషన్ కార్డు ఉండి హైదరబాద్ వంటి నగరాల్లో అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్న వారికి 200 యూనిట్ల ఉచిత కరెంటు వర్తిస్తుందా లేదా అనేది కూడా గందరగోళానికి గురి చేస్తున్న అంశమే. ఈ ప్రశ్నలతోనే ప్రజలు ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉండగా.. వచ్చేనెల నుంచి పథకం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ నెల కరెంటు బిల్లు చెల్లించాలా ? లేదా అనేది కూడా మరింత కన్ఫ్యూజన్ ను పెంచుతోంది. ఎందుకంటే దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇలా గృహజ్యోతి పథకం చుట్టూ ఎన్నో ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. మరి వీటన్నిటికి ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

- Advertisement -