తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి… భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు సినిమాతో కొత్త ట్రెండ్ కి నాంది పలికారు తరుణ్. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తరుణ్ తన జీవితంలో ఎదురైన అనుభవాల గురించి పంచుకున్నారు. చిన్నప్పటి నుంచే వీడియోలు తీయడం ఇష్టం అని, స్కూల్ కి ఎలా డుమ్మా కొట్టాలి, గ్రౌండ్ లో ఎలా ఆడుకుందాం అనే వాటిపై వీడియోలు తీసేవాడినని అన్నారు. అలా తీసిన వీడియోలను ఒకరోజు ప్రిన్స్ పాల్ చూసి ‘నీలో చాలా టాలెంట్’ ఉందంటూ మెచ్చుకున్నారని చెప్పారు.
మొదట్లో పెళ్లి వీడియోలు తీసేవాడినని, విజయ్ మాల్వా కూతురి పెళ్లి కవరేజీ చేశానని, అలాగే పోస్టర్స్ డిజైన్ చేసేవాడినని అలా వచ్చిన డబ్బులతో షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్లమని చెప్పుకొచ్చారు. పెళ్లి చూపులు సినిమా సమయంలో సినిమా ఆడదని, డబ్బులు ఉంటే తిని కూర్చో, కానీ ఇలాంటి సినిమాలు తీయకు అంటూ ఓ డిస్ట్రిబ్యూటర్ అన్నారని చెప్పారు. ఆ సమయంలో అమ్మతో చెప్పి ఏడ్చేశానని, అమ్మ చెప్పిన ధైర్యమే ఈ స్థాయికి తీసుకువచ్చిందన్నారు.