సినిమా తీసినం..!
మా మొదటి ఫీచర్ ఫిల్మ్ ఫైనల్ కట్ పూర్తి చేసినప్పుడు మాకు కలిగిన అనుభూతి ఇది. ఈ ఫిల్మ్‌ను మార్కెట్ చేయడానికి మంచి మార్గం గురించి అన్వేషిస్తున్నప్పుడు కలిగిన ఆలోచనతో రోల్ రైడా, తరుణ్ భాస్కర్‌లను కలుపుకొని సాగాలని మేం నిర్ణయించుకున్నాం. విషయం ఏదైనా కానీ, ఈ రకమైన స్పిరిట్ ఆఫ్ మేకింగ్‌కు వాళ్లిద్దరూ ప్రతినిధులనేది నా అభిప్రాయం.
సినిమా తీసినం స్ఫూర్తి..
తరుణ్ భాస్కర్‌కు నేనెక్కువ రుణపడి ఉంటాను. తన షార్ట్ ఫిల్మ్ రోజుల నుంచి అతని వర్క్ నాకు ప్రేరణనివ్వడం వల్లే, చివరకు సొంతంగా నేను సినిమా తియ్యగలిగాను.
నేను ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు మా దగ్గరుంది కేవలం రూ. 2 లక్షలు మాత్రమే. ఆ బడ్జెట్లోనే షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. మేం అతిగా ఊహించుకొని ఉండొచ్చు. కానీ విషయం ఏమంటే, మేం నిజంగా ఆ పని చేశాం. ప్రతి పైసా ఆదా చేస్తూ, నటులందరి షెడ్యూల్స్‌ను తీసేసుకుంటూ, సాధ్యమైనంత వరకు ప్రతి లొకేషన్‌ను పట్టుకుంటూ సినిమా పూర్తి చేశాం.మేం సాధించాం. ఈ విషయంలో నన్ను నమ్మి, నా కోసం సమష్టిగా పనిచేసి, నాకు సాయపడిన నా టీమ్‌కు ఎంతైనా రుణపడి ఉంటాను.
ఈ సినిమా దేని గురించంటే..
‘మనిషి బ్రతుకు ఇంతే’ అనేది ఒక వెబ్ ఫిల్మ్. తనలో కలిగిన డిప్రెషన్ నుంచి బయటకు వచ్చే సిద్ధార్థ్ అనే యువకుడి కథతో నడిచే నేటి కాలపు కామెడీ ఫిల్మ్ ఇది. సాధారణంగా డిప్రెషన్‌ను మన సినిమాల్లో చాలా భయంకరమైనదిగా చూపిస్తుంటారు. కానీ దానికి వినోదభరితమైన రెండో కోణం కూడా ఉందని మేం నమ్మాం. ఈ సినిమా ద్వారా ఆ రెండో వైపును చూపించాలనుకున్నాం. ప్రధానంగా ఆన్‌లైన్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకొని ఈ ఫిల్మ్ తీశాం. పదునైన ‘రా’ కంటెంట్ కోసం ఆన్‌లైన్ ఆడియెన్స్ బాగా ఆకలిగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ ఫిల్మ్ రూపొందించాం. అతి త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం.
తరుణ్ భాస్కర్ & రోల్ రైడా..
తెలుగు ర్యాప్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు రోల్ రైడా. మాకు పెద్ద బోనస్ అవుతుందనే ఉద్దేశంతోనే ఆయనతో కలిశామనేది నిజం. కాన్సెప్ట్ నచ్చి, ఇందులో పనిచేయడానికి ఆయన అంగీకరించాడు. తరుణ్ భాస్కర్ అయితే నిజంగా స్వీట్‌హార్ట్. తను కేవలం పాడటమే కాకుండా, రికార్డ్ స్థాయిలో ఒకే ఒక్క రోజులో యానిమేటెడ్ వీడియో తయారుచేయడం.. చాలా గొప్ప విషయం. ఆయన జీనియస్ మాత్రమే కాదు, ఎంతో వినయశీలి కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే, నా దృష్టిలో టాలీవుడ్‌లో తరుణ్ భాస్కర్ బెస్ట్ డైరెక్టర్.
సినిమా తీద్దాం!..
చాలామంది ఆర్థికంగా తట్టుకోలేని ఒక ఫిల్మ్ స్కూల్లో నేను చదువుకున్నాను. కాబట్టి ముందుకు వెళ్లడానికి.. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్, స్టూడెంట్స్ కలిసి పనిచేయగల ఒక లెర్నింగ్ కమ్యూనిటీని ప్రారంభించాలనుకున్నాం. సినిమాల గురించి నేర్పించడానికీ, తమ దగ్గరున్న డబ్బు, జనం, లొకేషన్స్ వంటి వనరులతో సినిమాలు నిర్మించడానికీ ఈ కమ్యూనిటీ ప్రజలకు తోడ్పడుతుంది.
‘కీప్ రోలింగ్’ భవిష్యత్ ప్రణాళిక..
‘మనిషి బ్రతుకు ఇంతే’ మూవీతో పాటు, మేం ఇంకో ఫిల్మ్ కూడా తీస్తున్నాం. ప్రస్తుతం అది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
మా పనిని కొనసాగించడంలో ‘కీప్ రోలింగ్’ అనే మా పేరును నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాం. మరిన్ని ఫిలిమ్స్ తీస్తూ, వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని మేమే చాలెంజ్ చేసుకుంటూ, ప్రతి సారీ మరింత మంచి ఫిల్మ్ తీయాలని ఆశిస్తున్నాం.
‘మనిషి బ్రతుకు ఇంతే’ తారాగణం, సాంకేతిక బృందం…
ఈ మూవీలో సిద్ధార్థ్ రెడ్డి, రేవంత్ ప్రధాన పాత్రధారులు.
హైదరాబాద్ ఇండీ ర్యాప్‌కు చెందినవాళ్లు అతిథి పాత్రల్లో కనిపిస్తారు.
నిర్మాణ సంస్థ – కీప్ రోలింగ్ పిక్చర్స్
రచన, కూర్పు, దర్శకత్వం: వరుణ్‌రెడ్డి
సినిమాటోగ్రఫీ: రోహిత్ బచ్చు
బీజీయం: బాబీ
అడిషనల్ బీజీయం: శిశిర్ (ఆల్ఫా బీయింగ్).