కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల (MP/MLC/MLA) సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రత్యుత్తరం రాశారు.
తెలంగాణ ప్రజలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తెలంగాణ నుంచి ప్రతి రోజూ వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖలో గుర్తుచేశారు.
గత సంప్రదాయం ప్రకారం తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు ఇచ్చే విజ్ఞాపనల మేరకు స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖలో కోరారు.
శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/- టికెట్) కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ (SED) (రూ. 300/- టికెట్) కొరకు రెండు లేఖలు స్వీకరించబడతాయని పేర్కొన్నారు. ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయొచ్చని చంద్రబాబు నాయుడు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Also Read:టీటీడీకి మండలి ఛైర్మన్ గుత్తా ధన్యవాదాలు