పంచాయతీ రాజ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ వ్యవస్థపై ప్రభుత్వం జారీ చేసిన GO 46 పై హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ దశలో ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కోర్టుల జోక్యం ఉండకూడదనే దాన్ని గుర్తుచేసింది.
విచారణలో భాగంగా, “సబ్ కేటగిరీ రిజర్వేషన్ అమలులో లేకపోవడం వల్ల మీరు ఎన్నికలను రద్దు చేయాలని కోరుతున్నారా?” అని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. రిజర్వేషన్ విధానంపై అభ్యంతరాలు ఉన్నా, ఎన్నికలను పూర్తిగా అడ్డుకోవాలనే ఉద్దేశమా అనే అంశాన్ని కోర్టు స్పష్టతతో తెలుసుకోవాలని ప్రయత్నించింది.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సరికాదు అని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది వాదించారు. రిజర్వేషన్‌పై వివాదం ఉన్నప్పటికీ ఎన్నికలు సమయానికి జరగాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక 42% రిజర్వేషన్ GOపై విచారణ జరుగుతున్న సమయంలోనే పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టంగా తెలిపిందని కోర్టుకు వెల్లడించారు. రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించి తుది తీర్పు వచ్చే వరకూ పాత విధానమే కొనసాగించాలని కోర్టుకు అప్పటికే తెలియజేశామని న్యాయవాదులు గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో విచారణను కోర్టు తదుపరి తేదీకి వాయిదా వేసింది.
Also Read:BB9:కెప్టెన్సీ రేసులో ఆరుగురు

