కరోనా మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తన వంతు భాగస్వామ్యం అందించడానికి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ముందుకు వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు విరాళంగా అందించింది.
ఈ మేరకు చాంబర్ ప్రతినిధులు శుక్రవారం తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, ఐటీ మినిస్టర్ కేటీఆర్‌ను కలిసి రూ. 25 లక్షల చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ పి. రామ్మోహన్ రావు, చాంబర్ అధ్యక్షుడు కె. మురళీమోహన్ రావు, ప్రధాన కార్యదర్శి సునీల్ నారంగ్, అభిషేక్ నామా పాల్గొన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిరళ కృషిని వారు ప్రశంసించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ప్రభుత్వానికీ, పోలీసులకు సహకరించాలనీ, ఎవరిళ్లల్లో వారు సురక్షితంగా ఉంటూ కరోనా వ్యాప్తి చెందకుండా తమ వంతు పాత్ర పోషించాలని వారు కోరారు.