అటు కేంద్రంలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ముందుస్తు ఎన్నికల మంత్రం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ క్లారిటీకి రావడంతో సార్వత్రిక ఎన్నికలు 2019కి బదులుగా 2018లోనే జరిగే అవకాశం ఉందని వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు హడావిడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్,చంద్రబాబుతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు ముందస్తుకు రెడీ అవుతున్నారు. ఎవరికి వారు తమ అస్త్రశస్త్రాలకు పదునుపెట్టేందుకు సిద్దమవుతున్నారు.
తెలంగాణలో తిరుగులేని పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఎప్పుడు ఎన్నికలొచ్చిన ఎదుర్కునేందుకు సిద్దంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు టీఆర్ఎస్‌ని మరోసారి గద్దెనెక్కించడం ఖాయమని ఆపార్టీ నేతలు కుండబద్దలు కొడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కు తిరుగులేని మెజార్టీని కట్టెబెట్టిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. దీనికి తోడు సరైన ప్రతిపక్షం లేకపోవడం కూడా ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశం. దీనికి తోడు ప్రతి ఇంటికీ మంచినీరు ఇవ్వకపోతే ఓట్లు అడగమన్న సీఎం కేసీఆర్ త్వరలోనే ఆ హామీని నేరవేర్చనున్నారు. మొత్తంగా తెలంగాణలో వార్ వన్ సైడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
అయితే ఏపీలో మాత్రం పోరు త్రిముఖంగా మారే అవకాశం ఉంది. టీడీపీ,వైసీపీ,జనసేన మధ్య పోరు హోరాహోరికి జరగనుంది. పోలవరం, రాజధానినిర్మాణం, ఏపీకి పెట్టుబడలు, నిరుద్యోగ భృతి, కాపులకు 5% రిజర్వేషన్లు ఇలా చంద్రబాబు ప్రజలపై వరాల వర్షం కురిపించేస్తున్నారు.మరోవైపు ప్రజాసంకల్పయాత్ర పేరుతో వైసీపీ అధినేత జగన్ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. నవరత్నాల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తునే టీడీపీని ఇరుకున పెట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక మరో పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో నామమత్రానికే పరిమితం కానుంది.
ఏపీ రాజకీయాల్లో తొలిసారి ఎన్నికలను ఎదుర్కొబోతున్న మరో పార్టీ జనసేన. ఇప్పటికే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన జనసేనాని పవన్..త్వరలోనే పూర్తిస్ధాయి పాలిటిక్స్‌లోకి రానుండటంతో పోరు త్రిముఖంగా మారే అవకాశం ఉంది. మొత్తంగా ఏక్షణాన ఎన్నికలు వచ్చినా అధికారం దక్కించుకునేందుకు అన్ని పార్టీలూ తమ ఎజెండాలతో ముందుకు పోతున్నాయి.