తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే స్వర్ణాభరణాలు సమర్పిస్తానని ఉద్యమ సమయంలో తిరుమలకు వచ్చిన సందర్భంగా కేసీఆర్ మొక్కుకున్నారు. తాజాగా ఆ మొక్కు తీర్చేందుకు మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న కేసీఆర్.. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు, మంత్రులతో కలసి కేసీఆర్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ భవిష్యత్తులో రెండురాష్ట్రాల సంబంధాలు చాలా గొప్పగా ఉంటాయని తెలిపారు.
ఇరురాష్ట్రాలు సుభిక్షంగా అభివృద్ధి చెందాలని తాను భగవంతుణ్ణి ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరిస్తామని.. భగవంతుడికి ప్రాంతీయ భేదాలు లేవని ఆయన తెలిపారు. తెలంగాణ తరపున స్వామివారికి మొక్కులు చెల్లించామన్నారు. తమ కుటుంబసభ్యులకు, మంత్రులకు, సహచరులకు చక్కటి దర్శనం అందిందని పేర్కొన్నారు.
ఈ మేరకు.. రూ.3.7 కోట్ల విలువైన 14.2 కిలోల స్వర్ణసాలగ్రామ హారం, రూ.1.21 కోట్ల విలువైన 4.650 కిలోల స్వర్ణ కంఠాభరణాలు టీటీడీకి అందించారు. ఈ సందర్భంగా త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.