తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యలపై ప్రొడ్యూసర్స్ గిల్డ్, మూవీ ఆర్టిస్ట్స్ ఆసోసియేషన్ బుధవారం భేటీ అయ్యింది. సినిమా చిత్రీకరణల్లో వృథా ఖర్చులు, స్థానిక ప్రతిభను వినియోగించుకోవటం, ఇతర చిత్ర పరిశ్రమల నటులకు మెంబర్‌షిప్ ఇవ్వడం, నటుల రెమ్యూనరేషన్ తదితర అంశాలపై చర్చ సాగినట్టు సమాచారం తుది నిర్ణయం కోసం గిల్డ్, మా….మరోసారి సమావేశం కానున్నాయి. మా తరపున అధ్యక్షుడు మంచు విష్ణు, రఘుబాబు, శివబాలజీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి దిల్ రాజ్, శరత్ మరార్, బాపినీడు, జీవితా రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు.
థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం కొత్త సినిమాలు త్వరగా ఒటీటీలో విడుదల కావటం టికెట్ ధరలు పెరగడం ఇలా పలు సమస్యలకు పరిష్కారం దిశగా నిర్మాతలంతా ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ నిలిపివేసిన విషయం తెలిసిందే. అన్నింటికీ పరిష్కారం లభించాకే చిత్రీకరణలు కొనసాగించాలని నిర్ణయించారు. ఆ మేరకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని కోణాల్లోనూ చర్చిస్తున్నాయి.