ముందస్తుగా చర్యలు తీసుకొండి : కేసీఆర్

92
kcr press meet
- Advertisement -

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండు రోజులపాటు ఉంటాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి నష్టం జరుగకుండ చూడాలని సీఎం కేసీఆర్ ఉన్నాతాధికారులను ఆదేశించారు. జనజీవనానికి అటంకాలు తగ్గించే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు అదేశించారు. భారీ వానల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటి పరిస్థితి అడిగి తగిన చర్యలు తీసుకొవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ సంబంధిత చర్యలపై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, పోలీస్, వైద్య, అప్రమత్తంగా ఉంటూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తుగా విద్యాలయాలకు సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ప్రయాణాలు తగ్గించుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రజలతో నేరుగా సంబంధాలుండే అన్ని శాఖలు నిరంతరం పనిచేసే విధంగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. రోడ్లపై జనసంచారాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాల వల్ల ఎగువ గోదావరి నుంచి వరద ముంచుకొస్తున్నందు వల్ల ఎస్సారెస్పీలో నీరు చేరుతున్న పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్నందున ఆ జిల్లాపై ఎక్కువ దృష్టిని సారించలన్నారు. అవసరమైతే తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రెస్య్కూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అవసరమైన చోట హెలికాప్టర్‌లను వినియోగించి రక్షణ సహాయక చర్యలను చేపట్టాలన్నారు.

సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి, ప్రతి ఆరు గంటలకొకసారి జిల్లా కలెక్టర్లతో, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. ఏటూరు నాగారం, రామన్న గూడెం ప్రాంతాల వరద ముంపు అధికంగా ఉంటుందని అధికారులు సీఎంకు తెలిపారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం కావాలన్నారు. వరద ముంపు అధికంగా ఉన్న భూపాలపల్లి, కొత్తగూడెం, నిజమాబాద్ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీంలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఫోన్ నంబర్లను ప్రజలకు చేరవేసేలా అధికారులు ప్రచారం చేయాలన్నారు. రాష్ట్రంలోని వరదముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలన్నారు. వానల నేపథ్యంలో తలెత్తుతున్న పరిస్థితులను వెంట వెంటనే సీఎం కార్యాలయానికి తెలియజేయాలన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూంలను ఏర్పాటుచేయాలన్నారు. వైర్లు తెగిపడిపోతే వేంటనే తక్షణ చర్యలు తీసుకొని నష్ట నివారణ చేపట్టాలన్నారు.

జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో వరద పరిస్థితులను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి వరద ప్రవాహం ఎక్కువగా ఉండే దారులలో ప్రమాద హెచ్చరిక సూచనలను ఏర్పాటు చేసి ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించే చర్యలను చేపట్టాలన్నారు. విద్యుత్ తీగలు తెగిపడటం, పాత గోడలు కూలడం వంటి ప్రమాదాలను పసిగట్టి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యారేజీలు, పక్క రాష్ట్రాల్లో నిండుతున్న బ్యారేజీల వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు చూడాలన్నారు. విద్యుత్, తాగునీటికి అంతరాయాలు కలుగుకుండా చూసుకోవాలన్నారు. వానలు ఆగినా తర్వాత వచ్చే వరదలు మరికొన్ని రోజులపాటు కొనసాగుతుందనే దృష్టితో కార్యాచరణ ఉండాలన్నారు. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లో వరద పెరిగే అవకాశమున్నందున నీటి విడుదల చర్యలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు వివేకానంద, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ఉన్నతాధికారులు సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎస్. నర్సింగ రావు, సెక్రటరీలు స్మితా సబర్వాల్, శేషాద్రి, రాహూల్ బొజ్జా, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, సీఎం ఒఎస్డీలు శ్రీమతి ప్రియాంక వర్గీస్, శ్రీ శ్రీధర్ రావు దేశ్ పాండే, ఎంఏ అండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, పీఆర్‌ అండ్ ఆర్డీ సెక్రటరీ శ్రీ సందీప్ సుల్తానియా, జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ లోకేష్ కుమార్, హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -