పడకేసిన పరిపాలన..గ్రామ కార్యదర్శులు అప్పుల పాలు!

13
- Advertisement -

పంచాయితీల్లో ఆస్తిపన్ను నూటికి నూరు శాతం వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు గ్రామ కార్యదర్శులకు అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఇంటిపన్ను వసూలుకు సైతం గ్రామ కార్యదర్శులే బాధ్యత తీసుకోవాలనీ, లేదంటే ఆ మొత్తం కోసం వాళ్ల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది! ఫలితంగా వేతనాలు హుష్ కాకి అవడంతో లబోదిబో అంటున్నారు గ్రామ కార్యదర్శులు! మరోవైపు గ్రామ కార్యక్రమాలకు సైతం కేటాయింపులు అడుగంటిపోయాయి! పనులు చేయాలి, పైసల్ మాత్రం అడగొద్దు! అంటే, అధికారుల తీరు ఉద్దెరే ముద్దు నగదు వద్దన్న చందంగా మారిపోయింది.

కాంగ్రెస్ పాలనలో ఆర్థికశాస్త్రం బొక్క బోర్లా పడ్డ విషయం తెలిసిందే! దీంతో అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు నిధుల మంజూరు నిలిచిపోయింది. 8 శాతం, 9 శాతం అంటూ వేలం పాటలా అడ్డగోలుగా కమిషన్లు దండుకుంటూ, ఒక ప్రణాళికా, పాడూ లేకుండా కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపడంతో, ఉన్న కాస్త ఖజానా కూడా అడుగంటిపోయింది. దీంతో కనీసం ఆర్థిక సంఘం, స్టేట్‌ ఫైనాన్స్‌ లు ఇచ్చే నిధులు కూడా పంచాయితీలకు చేరడం లేదు. ఫలితంగా గ్రామ పంచాయితీల ఖాతాలు ఖాళీ అయ్యాయి! నిధులు లేక పంచాయితీల నిర్వహణ కూడా ఆగం అవుతోంది. పనులు పూర్తి చేయాలి, కానీ పైసలు మాత్రం అడగొద్దు అంటూ ప్రభుత్వం కండిషన్ పెట్టడంతో విలేజ్ సెక్రెటరీలు ఎటూ పాలుపోని పరిస్థితుల్లో ఇరుక్కున్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ, నివేదికలు, సమావేశాలు, ఇలా కార్యక్రమం ఏదైనా నిధుల మంజూరు శూన్యం అవడంతో వాళ్లు ఒత్తిడి గురవుతున్నారు. గ్రామాల్లో పనులు కొనసాగించడానికి అప్పుల పాలవుతున్నారు.

జనవరితో సర్పంచుల పదవీకాలం ముగిసింది. ఫ్రిబ్రవరిలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. పంచాయితీల గడువు ముగిసి ప్రత్యేక అధికారుల పాలన మొదలయ్యాక పరిస్థితి మరీ వికటించింది. జనాభాకు అనుగుణంగా కేంద్రం నుంచి రావలసిన గ్రాంట్లు రావడం లేదు. పన్ను వసూళ్లు జరిగినా అవి సాదర ఖర్చులకు సైతం సరిపోవడం లేదు. ఆ మొత్తం కూడా ఒకటి లేదా రెండు నెలలకు మాత్రమే సర్దుబాటు అవుతుంది. తరవాత అంతా అప్పే! మరీ అర్జెంటైతే బంగారం కూడా కుదవే! ప్రత్యేక పాలనాధికారులకు గ్రామ పాలనపై పట్టు లేకపోవడం కొన్నిచోట్ల శాపంగా మారింది. నిధులు, విధులపై స్పష్టత లేకపోవడంతో వాళ్ల పరిస్థితి ఆనాజానా అన్న చందంగా తయారైంది! దీంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారి గ్రామాల్లో పాలన పడకేసింది. గ్రామాల్లో నీటిసరఫరా లేకుంటే పంచాయతీ కార్యదర్శులను బాధ్యులను చేస్తున్నారు. కనీసం కరెంట్‌ బిల్లులు, బోరు రిపేర్లు, ట్రాక్టర్లకు డీజిల్‌ కొనలేని దుస్థితి నెలకొంది. గ్రామాల్లో తాగునీటి అవసరాలకు మోటార్లు, పైపు లైన్ల లీకేజీల మరమ్మత్తులకు సైతం నిధులు కరువయ్యాయి. గ్రామ పంచాయితీ సిబ్బందికి నెలల కొద్దీ జీతాలు బకాయి ఉంటున్నాయి.

తాజాగా స్మశానవాటికలకు కరెంటు, నీటి సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టారు. కానీ వాటికి అవసరమైన నిధులు పంచాయితీల్లో లేవు. గ్రామశివార్లలో ఉండే స్మశాన వాటికలకు, పైప్ లైన్లు, విద్యుత్ లైన్లను ఖర్చు లక్షల్లో తడిసి మోపెడవుతోంది. ఇలా ఆర్థిక సమస్య వచ్చినప్పుడు భారం అంతా కార్యదర్శులే మోయాల్సి వస్తోంది. గ్రామ కనీస అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు తేవాల్సి వస్తోంది. సిబ్బందికి జీతాలు సైతం సొంత డబ్బులు చెల్లించి ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు తీసుకునే పరిస్థితి నెలకొంది. ఇక, ఉపాధి హామీ పథకం కోసం టార్గెట్‌ పెట్టి మరీ కూలీలను తీసుకురావాలని సూచిస్తున్నారు. ఏమాత్రం తేడా జరిగినా మెమోలు జారీ చేస్తున్నారు. ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీలో అవకతవకలు జరిగినా కార్యదర్శులపైన చర్యలు తప్పడం లేదు. అలా పని భారానికి ఆర్థిక ఇబ్బందులూ తోడవడంతో అనేక మంది పంచాయితీ సెక్రెటరీలు మానసిక ఒత్తిడికి, వేదనకు గురవుతున్నారు. ఇలా పనులు మాత్రం టైంకు, నిధులు మాత్రం ఉద్దెరే అన్న చందంగా అధికారుల వైఖరి ఉంటోంది. ఇవన్నీ పోను పన్నుల వసూలు తతంగం మరో ప్రహసనం! ఎవరిచ్చినా, ఇవ్వకపోయినా నిర్ణీత పన్ను మొత్తం కలెక్ట్ కాకపోతే కార్యదర్శుల జీతం కట్! విసిగి వేసారిన సెక్రెటరీలు, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని నిందిస్తున్నారు.

Also Read:KTR:రేవంత్ రెడ్డివి మూర్ఖపు నిర్ణయాలు

- Advertisement -