వాహనాలు షోరూమ్‌ల వద్దే రిజిస్ట్రేషన్

5
- Advertisement -

తెలంగాణ రవాణా శాఖ ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా మరో కీలక నిర్ణయం అమలు చేసింది. ఈ రోజు (24-01-2026) నుంచి వాహనం కొనుగోలు చేసిన వారు ఇకపై రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, షోరూమ్‌ల వద్దనే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా నిన్న (23-01-2026) హైదరాబాద్‌లోని శ్రీ కృష్ణ ఆటోమోటివ్స్ షోరూమ్‌లో విజయవంతంగా అమలు చేశారు. షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ వాహనదారుడికి సంబంధిత పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ELEVATE ZX MT నాలుగు చక్రాల వాహనాన్ని కొత్త విధానం ద్వారా యజమానికి అందజేయడం జరిగింది.

డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ జరిగేలా ఈ నెల 8వ తేదీన విధానపర నిర్ణయం తీసుకున్న రవాణా శాఖ, 15 రోజుల్లో సాఫ్ట్‌వేర్ సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఆ మేరకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి విజయవంతంగా పరీక్షించారు. సాఫ్ట్‌వేర్ పూర్తిస్థాయిలో పనిచేయడంతో ఈ రోజు నుంచి కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాలు, కార్లకు ఈ విధానం వర్తిస్తుందని రవాణా శాఖ ప్రకటించింది.

కొత్త విధానం ప్రకారం అధికారిక డీలర్‌నే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు. ఇన్వాయిస్, ఫారం–21, ఫారం–22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫోటోలు వంటి అన్ని పత్రాలు డీలర్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయబడతాయి. రవాణా శాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపబడుతుంది.

ఈ విధానం అమలుతో సమయం ఆదా కావడంతో పాటు, RTO కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుంది. అవసరమైతే అధికారులు షోరూమ్‌లలో యాదృచ్ఛిక తనిఖీలు నిర్వహిస్తారని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఈ సౌకర్యం ద్విచక్ర వాహనాలు, కార్లకే పరిమితం కాగా, వాణిజ్య వాహనాలకు వర్తించదు. 24-01-2026 నుంచి కొనుగోలు చేసిన వాహనాలకే ఈ విధానం అమల్లో ఉంటుంది.

Also Read:రజినీకాంత్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్!

- Advertisement -