మరోమారు రుజువైంది..

244
Telangana top state in india
Telangana top state in india
- Advertisement -

తెలంగాణ ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్న విషయం మరోమారు అక్షర సత్యమని రుజువైంది. నేడు 2016-17 ఆర్థిక సంవత్సరం గణాంకాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెల్లడించారు. ఫిబ్రవరి వరకు ఈ వివరాలు బహిర్గతమయ్యాయి. దీని ప్రకారం..ఆదాయాభివృద్ధి రేటులో తెలంగాణ రాష్ట్రం మరోమారు అగ్రస్థానంలో నిలిచింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి వరకు కంప్ట్రోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెల్లడించిన గణాంకాల ఆధారంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని తెలిపింది. ప్రధాన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 17.82 శాతం వృద్ధి, అన్ని రకాల పన్నుల ఆదాయంలో 17.81శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. ప్రధానమైన అమ్మకం పన్ను, ఎక్సైజ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల ద్వారా 2015-16లో ఫిబ్రవరి నెల వరకు రాష్ట్రానికి రూ.33,257 కోట్ల ఆదాయం వచ్చింది. అదే 2016-17లో ఫిబ్రవరి నెల వరకు వీటి ద్వారా రూ.39,183 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో 17.82 వృద్ధి నమోదైంది.

ఈ మూడు పన్నులతో పాటు రవాణారంగం, ఇతర ఆదాయ మార్గాలన్నీ కలిపితే 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు రూ.36,130 కోట్ల ఆదాయం వస్తే… 2016-17లో ఫిబ్రవరి వరకు రూ.42,564 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం ఆదాయంలో 17.81శాతం వృద్ధిరేటు సాధించింది. రెండు విభాగాల్లోనూ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. రెండు విభాగాల్లో వృద్ధిరేటు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమవుతుందని ఉద్యమ సమయంలో తాను చేసిన వాదన మూడేళ్లలో పలుమార్లు రుజువైందని వ్యాఖ్యానించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గకుండా పెరుగుదల సాధించడం గొప్ప విషయమన్న సీఎం.. అధికారులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదాయ వృద్ధిరేటులో అనుకున్న పెరుగుదల ఉన్నందున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్తామని సీఎం ప్రకటించారు.

- Advertisement -