తెలంగాణలో తాము అధికారం లోకి వచ్చాక ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో 2021-22 సంవత్సరానికి ఐటీ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు సాధించిన అభివృద్ధిని వివరించారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా గతేడాది ఐటీ రంగం లో అంచనాలకు మించి రాణించామన్నారు.
ఐటీ, అనుబంధ ఎక్స్ పోర్ట్స్ లో గతేడాది 26.14శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే తెలంగాణలో 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించామన్నారు. దేశంలో గత సంవత్సరం 4.5లక్షల ఉద్యోగాలు వస్తే అందులో లక్షన్నర హైదరాబాద్‌లో వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉన్నాయని, 8ఏళ్లలో 4.1లక్షల ఐటీ ఉద్యోగాలు తెలంగాణలో వచ్చాయన్నారు.
జూన్ 20న టీ హబ్ 2వ దశ ప్రారంభిస్తామని, టీ వర్క్స్ కొత్త ఫెసిలిటీ ఆగస్టు లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు కేటీఆర్ వెల్లడించారు.