కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్న రేవంత్ రెడ్డి..

229
Telangana TDP president Revanth Reddy may join Congress
- Advertisement -

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఏఐసీసీ పగ్గాలు అందుకునే లోపే రేవంత్ కాంగ్రెస్‌లో చేరనున్నారు.! రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన రేవంత్ కాంగ్రెస్ ముఖ్యనేతలతో మంతనాలు జరిపారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలో కలిసారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై ఉత్తమ్ కూడా పార్టీ పెద్దలతో మంతనాలు జరిపారు. అంతేకాదు రేవంత్ చేరికకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఓ కీలక పదవిని కూడా ఇవ్వబోతుందన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రేవంత్ కాంగ్రెస్‌లో చేరడంపై ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఖరారు చేశారు. అయితే న్యూ ఢిల్లీలోనే రేవంత్‌ను పార్టీలోకి చేర్చుకోవాలా లేదా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ కండువా కప్పాలా అన్నది ప్రస్తుతం చర్చ జరుగుతోందని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు తెలిపారు. మరీ ముఖ్యంగా రేవంత్‌ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.

Telangana TDP president Revanth Reddy may join Congress

ఇదిలా ఉంటే రేవంత్ రాకపై కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం వల్ల పార్టీకి మరింత నష్టం వాటిల్లే అవకాశముందని కొందరు నేతలు అధిష్టానానికి చెప్పినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ను ఎక్కువగా తిట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి మాత్రమే ఉన్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా అధిష్టానానికి అదే సమాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు వివరించారు. అప్పుడే ఫిర్యాదుల పర్వం మొదలవుతుండటంతో అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోంది.

అయితే ఈ వ్యవహారమంతా వారం రోజులుగా జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైంది. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీపై రేవంత్ తిట్లదండకం, ఓటుకు నోటు కేసును రేవంత్ సామాజిక వర్గానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి నిశితంగా వివరించారు. ఆయన కాంగ్రెస్‌లోకి వస్తే పార్టీకి చెందిన కొందరు నేతలు మళ్లీ పార్టీ మారే అవకాశముందని కూడా చెప్పినట్లు సమాచారం.

Telangana TDP president Revanth Reddy may join Congress

పార్టీ మారుతున్నట్లు మీపై వార్తలు వస్తున్నాయి.. ఈ విషయంపై మీరు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించగా.. ఢిల్లీలో మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. “త్వరలోనే మీడియా ముందుకు వస్తానని రేవంత్ మాట దాటవేసే ప్రయత్నం చేశారు. పార్టీ మారే విషయంతో పాటు మరికొన్ని విషయాలను కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. మొత్తానికి రేవంత్ మాటలను బట్టి చూస్తే కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇటీవల పరిటాల రవి తనయుడు శ్రీరామ్ పెళ్లికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించడం.. ఆయన్ను స్వాగతించడం, పరిటాల రవి సమాధిపై పూలు చల్లించడం.. అంతేకాకుండా టీఆర్‌ఎస్‌తో ఏపీకి చెందిన కొందరు నేతలు అనుబంధం పెంచుకొని కాంట్రాక్టు పనులు తెప్పించుకోవడం ఇవన్నీ తనకు నచ్చలేదు.. అందుకే అలాంటి వారితో నేనుండటం సబబేనా?” అన్నట్లుగా కూడా రేవంత్ రెడ్డి వివరించారు. మొత్తానికి దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి.. హస్తం గూటికి చేరడం దాదాపు ఖాయమైనట్లుగా తెలిసిపోతోంది.

- Advertisement -