వచ్చే నెలలో మొదలయ్యే ఐదో విడత తెలంగాణ హరితహారం కార్యక్రమం కోసం అన్ని జిల్లాల అటవీ అధికారులు, సిబ్బందితో ఈ రోజు సచివాలయంలో ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలైలో మొదలయ్యే ఐదో విడత తెలంగాణ హరితహారం కోసం అటవీ శాఖ యంత్రాంగం అంతా సర్వసన్నద్దంగా ఉండాలని, నర్సరీల్లో ఉన్న అన్ని మొక్కలను నాణ్యత, ఎత్తుపరంగా విభజించి పెట్టాలని అన్ని జిల్లాల సిబ్బందికి ఉన్నతాధికారులు సూచించారు. ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోత్సాహంలో భాగంగా టేకు, గంధం, వెదురు, సరుగుడు మొక్కలను రైతులకు ఈసారి అందిస్తున్నామని, హార్టీకల్చర్ శాఖ నోడల్ ఏజెన్సీగా పంపిణీ చేపడుతుందని అధికారులు తెలిపారు. రెండున్నర కోట్ల టేకు మొక్కలు, పదిన్నర లక్షల గంధం మొక్కలు ( ఉద్యానవన శాఖ మరో పదిలక్షల మొక్కలు) 4.3 లక్షల వెదురు, సరుగుడు మొక్కలు అటవీ శాఖ నర్సరీల్లో సిద్దంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మొత్తంగా 83 కోట్ల మొక్కలను రాష్ట్రవ్యాప్తంగా ఈసారి సీజన్ లో నాటాలనే లక్ష్యంతో పనిచేయాలని, వివిధ శాఖలు నాటాల్సిన మొక్కల సంఖ్యను కూడా జిల్లాల వారీగా నిర్ణయించటమైందన్నారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా సమన్వయ కమిటీలు శాఖల మధ్య సమన్వయం, కార్యాచరణ ప్రణాళికపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో ప్రతీ గ్రామపంచాయితీలో నర్సరీలు, మొక్కలు నాటడం, సంరక్షణ విధానంపై శిక్షణ ఉంటుందని, అటవీ శాఖ తరపున సాంకేతిక సహకారం అందిస్తామని తెలిపారు.
వివిధ సాగునీటి ప్రాజెక్టులు, పథకాల కోసం మళ్లించిన అటవీ భూమికి బదులుగా రెవెన్యూ భూముల్లో చేపట్టిన ప్రత్యామ్నాయ అటవీ పెంపకం పనులపై సమావేశంలో సమీక్షించారు. కాలేశ్వరంతో పాటు సీతారామ ప్రాజెక్టు పరిధిలో కంపా నిధులతో చేపట్టిన ఈ కార్యక్రమం త్వరితగతిని పూర్తి కావాలన్నారు. ఎండలు కొనసాగుతున్నందున వన్యప్రాణుల దాహార్తిపై దృష్టి పెట్టాలని, అడవుల్లో సహజ, కృత్రిమ నీటివనరుల లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతీ రక్షిత అటవీ ప్రాంతంలో ఒక్కో బీట్ లో ఒక గడ్డి క్షేత్రం ( గ్రాస్ ల్యాండ్ ను) అభివృద్ది చేయాలన్నారు. ఇక అటవీ భూముల ఆక్రమణల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, రెవెన్యూ, పోలీసులు, సంబంధిత శాఖల సమన్వయంతో కొత్తగా ఎక్కడ కూడా అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ ) పీ.కే.ఝా ఆదేశించారు.
అటవీ భూముల చూట్టూ కందకాల (ట్రెంచ్) తవ్వకం, అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతి, పార్కుల్లో హెర్బల్ గార్డెన్, ఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యతను ఇవ్వాలని తెలిపారు. హరితహారం సన్నద్దతపై వచ్చే వారం అన్ని జిల్లాల అధికారులతో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తారని అధికారులు వెల్లడించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పీసీసీఎఫ్ లు పీ.కే.ఝా, ఆర్.శోభ, అదనపు పీసీసీఎఫ్ లు మునీంద్ర, లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం.డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, పర్గెయిన్, ప్రత్యేక అధికారులు తిరుపతయ్య, శంకరన్ తదితరులు పాల్గొన్నారు.