కొత్త ట్రాఫిక్ జరిమానాలపై ఏం చేయాలో అర్ధం కాక తల పట్టుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు,బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పాయి. ప్రమాదాలు తగ్గించడానికంటూ ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణపై భారీ జరిమానాలు విధించాలన్న కేంద్రం అనాలోచిత చర్యపై దేశపౌరులు భగ్గుమన్నారు.
చిన్న తప్పులకి ఇంత భారీ పెనాల్టీలు కట్టాలా? అంటూ ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు వాహనదారులు. ఈ నేపథ్యంలో తెలంగాణ కొత్త వాహన చట్టాన్ని అమలు చేయబోమంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు సీఎం కేసీఆర్ .చలానాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
ఇక బీజేపీయేతర రాష్ట్రాలే కాకుండా, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కొత్త చట్టంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న విషయం గమనించిన కేంద్రం ఎట్టకేలకు కాస్త వెనక్కి తగ్గింది. రవాణా కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉంటుంది కాబట్టి చట్టాన్ని యథాతథంగా అనుసరించాలా లేదా అన్నది రాష్ట్రాల ఇష్టమని, కేంద్రం నిర్ణయాన్ని బలవంతంగా రుద్దబోమని నితిన్ గడ్కరీ చెప్పారు. దీంతో వాహనదారులకు కాసింత ఊరట లభించింది.