TG:తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్

3
- Advertisement -

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేడు అట్టహాసంగా ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ రాష్ట్రం చేపట్టిన అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలపై కీలక చర్చలకు వేదిక కానుంది.

ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఫ్యూచర్ సిటీ’కి చేరుకుంటారు. గ్లోబల్ సమ్మిట్ వేదికలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్, స్టార్టప్స్, పరిశ్రమల ప్రదర్శన స్టాళ్లను సీఎం ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.

తదుపరి, మధ్యాహ్నం 1:30 గంటలకు సమ్మిట్ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సమావేశంలో పాలన రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అలాగే రాబోయే సంవత్సరాలకు సంబంధించి రూపొందించిన భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను ముఖ్యమంత్రి విస్తృతంగా వివరించనున్నారు.

సమ్మిట్‌కు దేశ–విదేశాల నుంచి దాదాపు 3,000 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బిజినెస్ లీడర్లు, రంగాల వారీ నిపుణులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, కొత్త పరిశ్రమల ఏర్పాట్లు, ఐటీయూ సహా విభిన్న రంగాల్లో భాగస్వామ్యాలపై చర్చలు సాగనున్నాయి.

ప్రారంభోత్సవ వేడుకల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధి బృందాలతో వన్-టు-వన్ రౌండ్‌టేబుల్ మీటింగ్స్ చేపడతారు. ప్రతి 15 నిమిషాలకో ప్రైవేట్ బిజినెస్ మీటింగ్ షెడ్యూల్ చేసిన ప్రభుత్వం, పెట్టుబడిదారుల అవసరాలు, ప్రతిపాదనలు, భాగస్వామ్యాలపై నేరుగా చర్చించేందుకు ఈ సమ్మిట్‌ను వేదికగా ఉపయోగిస్తోంది.

మధ్యాహ్నం 3 గంటల నుంచీ సాయంత్రం 7 గంటల వరకు, ముఖ్యమంత్రి మొత్తం 15 కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర పరిశ్రమల విస్తరణ, కొత్త ఉద్యోగావకాశాలు, భవిష్యత్ మౌలిక సదుపాయాలకు దారితీసే నిర్ణయాలు ఈ సమావేశాల్లో తీసుకునే అవకాశం ఉంది.ఈ రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణను పెట్టుబడుల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అడుగులు వేస్తోంది.

Also Read:వేద పాఠశాలలో సంతోష్ కుమార్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌

- Advertisement -