తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తీవ్ర ప్రభావం చూపించాయి. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కూడా పడింది. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి తూర్పు కోస్తాంధ్ర వరకు వ్యాపించిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అల్పపీడనం బలహీనపడుతున్నప్పటికీ, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా. జనగాం, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
సోమవారం కురిసిన వర్షాల వల్ల పంటలకు గణనీయమైన నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, జొన్న వంటి పంటలు నేలవాలాయి. నగరంలో కూడా ఈదురుగాలులతో వర్షం కురవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రైతులు పంటలను రక్షించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
Also Read:బెంగాల్ ఓటర్లకు ప్రధాని భావోద్వేగ లేఖ

