తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు చేరింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు ప్రకటించారు. వరద ఉధృతి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో గేట్లు ఎత్తివేతకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుండి భారీగా వరద నీరు చేరుతోంది. 4,41,222 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ఆదివారం సాయంత్రానికి జలాశయం నీటిమట్టం 885 అడుగులకుగాను 873.40 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 156.3860 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 940 క్యూసెక్కులుగా ఉండగా ప్రస్తుత నీటిమట్టం 1,389 అడుగులుగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం తగ్గుముఖం పట్టింది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ ఫ్లో 18 వేల క్యూ సెక్కులుగా ఉండగా నంది పంప్ హౌజ్‌కు 12,600 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ 331క్యూసెక్కుల ఎత్తి పోత కొనసాగుతోంది.
కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5 వేల క్యూసెక్కులుగా ఉండగా కుడి, ఎడమ కాల్వలకు 400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కొమురం భీం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 2 వేల క్యూ సెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14.74 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
Also Read:సోషల్ మెసేజ్ ఇచ్చే ..’విరాజి’: ఆద్యంత్ హర్ష