రవిప్రకాశ్‌ కోసం బెంగళూరుకు పోలీసులు..!

232
ravi prakash

ఫోర్జరీ,డేటా చౌర్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించిన రవిప్రకాశ్‌ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్ధానం కొట్టేసింది. దీంతో రవి ప్రకాశ్‌ ముందున్న అన్ని దారులు మూసుకుపోయాయి.

పోలీసు నోటీసులకు రవిప్రకాశ్‌ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏ క్షణమైనా అరెస్ట్‌ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రవిప్రకాశ్‌ బెంగళూరు వెళ్లిపోయారని, తర్వాత గుజరాత్‌ వెళ్లారనే సమాచారంతో అక్కడా కూడా సోదాలు నిర్వహించారు. కానీ, తాజాగా రవిప్రకాశ్‌ మళ్లీ బెంగళూరుకే వచ్చినట్టు తెలియడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. మరోవైపు ఇదే కేసులో సహ నిందితుడిగా ఉన్న సినీనటుడు శివాజీ కోసమూ పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

వాటాల వివాదంలో రవిప్రకాశ్‌పై కేసులు నమోదైనప్పటి నుంచి ఆయన్ని విచారించేందుకు పోలీసులు పలు సందర్భాల్లో ప్రయత్నించి విఫలమయ్యారు. సైబర్‌క్రైమ్‌ ఠాణాకు హాజరై వివరణ ఇవ్వాలని పోలీసులు తొలుత 160 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చారు. వాటికి స్పందించక పోవడంతో 41సీఆర్పీసీ నోటీసులు జారీచేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.