జేపీ నడ్డా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు…!

277
jp nadda
- Advertisement -

సంక్షేమ,అభివృద్ధి పథకాలతో దేశంలోనే నెంబర్‌ 1గా నిలిచిన తెలంగాణపై కేంద్రం ప్రభుత్వ శీతకన్ను మరోసారి బహిర్గమైంది. బీజేపీ జన్ సంవాద్ వర్చువల్ ర్యాలీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్టను మరింతగా దిగజార్చేవిధంగా ఉన్నాయి.

ఎందుకంటే కరోనా వైరస్‌, ప్రజల ప్రాణాలను కాపాడటం,వారికి భరోసా కల్పించడంలో ఆది నుండి ప్రాధాన్యత ఇస్తూ కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రాలకు పెద్దన్నలాంటి కేంద్రం నుండి ఎలాంటి సాయం అందకపోయిన వలసకూలీలను ఆదుకోవడం, కరోనా పేషంట్లకు చికిత్స అందించడంతో పాటు కరోనా వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది సీఎం కేసీఆర్ సర్కార్.

సీఎం కేసీఆర్ నిర్ణయాలతో ప్రజలతో పూర్తి విశ్వాసంతో ఉండగా బీజేపీ నేతలు మాత్రం ఇందుకు విరుద్దంగా వ్యవహరించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కరోనా కట్టడిలో తెలంగాణ విఫలమైందంటూ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎందుకంటే కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందాలే హర్షం వ్యక్తం చేశాయి. లాక్‌ డన్‌, కేంద్రం గైడ్‌ లైన్స్‌ను ఫాలో అవుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది తెలంగాణ సర్కార్. అందుకే దేశానికి వైద్య శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న జేపీ నడ్డా… వైద్యులు చేస్తున్న కృషిని తక్కువ చేసి చూపడం సబబా? అంటూ డాక్టర్లే ప్రశ్నిస్తున్న పరిస్ధితి నెలకొంది.

ఇక తాజాగా జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని, కేంద్రాన్ని నవ్వులపాలు చేసేలా ఉంది. ఒకేసారి వేలమందికి కరోనా పరీక్షలు చేయడానికి రోషె కంపెనీ వారు తయారు చేసిన కోబాస్ 8800 మెషీన్ జర్మనీ నుండి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. రెండు మెషీన్లకు ఆర్డర్ ఇచ్చి రోజుకు పదివేల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది.

కానీ ఈ యంత్రం తెలంగాణ ఆర్డర్ చేసింది అన్న విషయం తెలుసుకున్న కేంద్రంలోని నాయకులు కొందరు పావులు కదిపారు. ఇప్పుడు ఆ మెషీన్ ను చెన్నై నుండి హైజాక్ చేసి కలకత్తాకు తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశాన్ని తెలుపుతూ రోషే కంపెనీ వారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది.

ఒకవైపు ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ మరోవైపు సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలంగాణను బద్నాం చేసే ప్రయత్నం చేయడం నోటితో నవ్వి నోసలితో వెక్కరించేలా ఉందని పలువురు అభిప్రాయడపతున్నారు. తెలంగాణ కూడా ఈ దేశంలో భాగమేనని గుర్తుంచుకోవాలని నెటిజన్లు సెటైర్ వేస్తున్నారు.

కేంద్ర మంత్రిగా ఎన్నిసార్లు ప్రజలకు భరోసా ఇచ్చే పనులు చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా నియంత్రణలో చెమటోడ్చి పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యమైనంత సాయం చేయాల్సిన కేంద్రం… కాళ్లల్లో కట్టెలు పెట్టే పనులు చేయడం ఎంతవరకు సమంజసమో తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యవసర స్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి దన్నుగా రాష్ట్రాలు నిలవాలి అనే సమాఖ్య స్ఫూర్తిని, రాజకీయ పరిణతిని ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిస్తుంటే, కేంద్రంలోని పెద్దలు మాత్రం ఇంత విపత్తులోనూ చిల్లర రాజకీయాలు చేస్తూ తమ అల్ప బుద్ధిని బయటపెట్టుకుంటున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -