శాసనసభ ఎన్నికల్లో భాగంగా కీలకమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల పర్వం ముగియనుండటంతో ఇవాళ భారీ సంఖ్యలో నామినేషన్స్ దాఖలయ్యే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1497 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, సీనియర్ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మంత్రి కేటీఆర్,మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల,సీపీఐ నేత చాడ వెంకటరెడ్డితో పాటు మరికొంత మంది నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనాన్ని సమీకరించి భారీ ర్యాలీతో నామినేషన్ వేసి బలప్రదర్శన చేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
బీఫారాలు ఇవ్వకుండా కేవలం నామినేషన్ వేసిన వారు ఇవాళ బీఫారాలు సమర్పించాల్సి ఉంటుంది. 21, 22 తేదీల్లో నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది. తర్వాత బరిలో ఉన్న వారి జాబితాను అధికారికంగా ప్రకటించనుంది ఈసీ.