తెలంగాణలో పలు మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మరియు ఆయన పీఏలు ప్రవేశించి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపణలు వినిపించాయి. నాన్-లోకల్ కాంగ్రెస్ నాయకులను పోలింగ్ కేంద్రాల్లోకి ఎలా అనుమతించారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పోలీసులను నిలదీశారు. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేసిన జాజాల సురేందర్‌తో పాటు బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బాన్సువాడ మున్సిపాలిటీలో కూడా వివాదం చోటుచేసుకుంది. 9వ వార్డులో బందోబస్తు నిర్వహిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభపెడుతున్నాడని ఆరోపించారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు అతన్ని నిలదీయగా ఉద్రిక్తత నెలకొంది.
కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భర్త సతీష్, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. 100 మీటర్ల పరిధిలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడమే కాకుండా, ఓటర్ స్లిప్పుల వెనుక పార్టీ గుర్తుతో కూడిన కరపత్రాలు పంచుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఇరుపక్షాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్నప్పటికీ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపించాయి.
Also Read:కెనడాలో కాల్పుల కలకలం..
మహబూబాబాద్ 14వ వార్డులో కూడా పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావుపై బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణ చేయి చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

