తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. తెలంగాణ ఆడపడుచులంతా ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో నేడు బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించి.. బతుకమ్మ పాటలకు అనుగుణంగా బొడ్డెమ్మలు ఆడారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ ఎంపీ కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కాగా..ప్రగతి భవన్‌కు చేరుకున్న మహిళలంతా బతుకమ్మ సంబరాల్లో మునిగిపోతూ.. అందరూ కలిసి బతుకమ్మ పాటలకు అనుగుణంగా లయబద్ధంగా ఆడారు.
అయితే ఈ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ సతీమణి విమల, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సతీమణి విమల, హరీష్‌రావు సతీమణి శ్రీనిత, అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డాతో పాటు పలువురు మహిళలు, ప్రగతి భవన్ మహిళా సిబ్బంది పాల్గొన్నారు.