రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 12 జిల్లాల పరిధిలో ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ – ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రెండు నియోజకవర్గాల్లో 1,530 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయగా.. 7,560 మంది సిబ్బందిని నియమించింది. రెండు నియోజకవర్గాల్లో భారీసంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో బ్యాలెట్‌ను దినపత్రిక సైజులో ముద్రించారు. వీటికి అనుగుణంగా జంబో బ్యాలెట్ బాక్సులను రూపొందించారు.
మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గంలో 5,31,268 మంది, వరంగల్-ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 5,05,565 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గం నుంచి 93 మంది, వరంగల్- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.