ఓఆర్‌ఆర్‌ చుట్టూ సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌ : కేటీఆర్‌

118
ktr
- Advertisement -

హైదరాబాద్‌ విశ్వనగరంలో భాగంగా సైకిల్‌ ట్రాక్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఔటర్‌ రింగు రోడ్డు చుట్టూ మరో మణిహారం రాబోతోంది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ వద్ద సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భూమి పూజ కూడా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్ర న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

మొదటి దశలో మొత్తం 23 కి.మీ మేర దీన్ని నిర్మించనున్నారు. 16 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా సోలార్‌ రూఫ్‌ ను డిజైన్‌ చేయనున్నారు. 2023 వేసవి నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని హెచ్‌ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంను తొలుత ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని నానక్‌రాం గూడ నుంచి టీఎస్‌పీఎస్‌ వరకు 8.5 కి.మీ విస్తరించాలని నిర్ణయించారు. తదుపరి నార్సింగి నుంచి కొల్లూరు వరకు మరో దఫాగా 14.5 కి.మీ మేరకు సర్వీసు రోడ్లకు ఇరువైపులా ఈ ట్రాక్‌ను నిర్మించనున్నారు.

సాధారణ సైకిల్‌ ట్రాక్‌ మాదిరిగా కాకుండా ఆధునిక వసతులతో దీనిని తీర్చిదిద్దనున్నారు. ఈ ట్రాక్‌ 4.5 మీటర్ల వెడల్పు ఉండగా, రెండువైపులా ఒక మీటర్‌ వెడల్పుతో పచ్చదనాన్ని తీర్చిదిద్దుతారు. దక్షిణ కోరియాలోని డేజియాన్‌ నుంచి సెజోంగ్‌ నగరాల మధ్య 32 కి.మీ పరిధిలో అధునిక వసతులతో ఉన్న సైకిలు ట్రాక్‌ను ఇటీవల హెచ్‌ఎండీఏ అధికారులు పరిశీలించి వచ్చారు. అదే మాదిరిగా నగరంలోని అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు ఇరువైపులా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనితో పాటుగా హైదరాబాద్‌కు మరో అవుటర్‌ రింగ్‌ రోడ్డు ఏర్పాటు అనుమతులు కూడా వచ్చాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండే.. ప్రజాఉపయోగమైన ఈజీ నాన్‌ మోటరైజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సోల్యూషన్స్‌ లక్ష్యంతో ఈ ట్రాక్‌ను శంకుస్థాపన చేశామన్నారు. ఆరు నెలల కిందట ఓ మిత్రుడు సౌత్‌ కొరియాలో సైక్లింగ్‌ ట్రాక్‌ ఉందని, హైవే మధ్యలో సోలార్‌ ప్యాన్లతో కట్టారు.. చూడడానికి బాగుందని చెప్పగా అది హైదరాబాద్‌లో, తెలంగాణలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకొని అధికారుల బృందం పంపించమన్నారు. దానికి అనుగుణంగా అధికారులను సౌత్‌ కొరియాకు వ్యక్తిగతంగా పంపామని, ఆ తర్వాత దుబాయిలో బాగుందంటే వెళ్లి అక్కడి మోడల్‌ను స్టడీ చేశారన్నారు.

విస్తృతమైన పురోగతి, పట్టణీకరణ జరుగుతుందని, దానికి తగినట్లుగా స్థానికంగా ఉండే యువకులు, ఐటీ రంగాల్లో పనిచేసే వారందరికీ ఇంటి నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్‌ నుంచి ఇంటికి అవసరమైతే బైసైక్లింగ్‌ చేస్తూ వెళ్లి వచ్చే పద్ధతి ఏర్పాటు చేస్తే బాగుంటుందని, కేవలం ఆఫీస్‌కి వెళ్లి రాకుండా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం సైతం బాగుంటుందన్న ఉద్దేశ్యంతో దీనిపై ప్రణాళికలు చేశామన్నారు. ప్రస్తుతం కాలంలో అందరికీ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరిగిందన్నారు. 24 గంటలు ఈ ట్రాక్‌ అందుబాటులో ఉంటుందని, అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లందరికీ ఉత్సాహపరిచేలా భారత్‌లో తొలిసారిగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. భవిష్యత్‌ అంతర్జాతీయ సైక్లింగ్‌ టోర్నీ నిర్వహించేందుకు అనుకూలంగా ఉండేలా నిర్మిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -